/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Saturday, October 8, 2011

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

Monday, August 15, 2011

నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగా హాయ్ హాయ్
నా సామిరంగా
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం
హాయ్ హాయ్ నా సామిరంగా
హాయ్ హాయ్ నా సామిరంగా
బతకాలందరు దేశంకోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
స్వార్థమూ వంచన లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ
హాయ్ హాయ్ నా సామిరంగా
నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా

రచన: ఆరుద్ర
పాడిన వారు : ఘంటసాల
సంగీతం - ఎం. ఎస్. విశ్వనాధం
సినిమా - సిపాయి చిన్నయ్య (1969)

Friday, July 15, 2011

గురుపౌర్ణమి విశిష్ఠత

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.

అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు.పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tuesday, July 12, 2011

తొలి ఏకాదశి పండుగ

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.



ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు.

ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు

నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

Sunday, April 3, 2011

ఉగాది

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ. ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి (అనగా చైత్రమాసములో శుక్ల పక్షము నందు పాడ్యమి తిథి కలిగిన మొదటిరోజు) రోజున వస్తుంది.

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.

"ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.

Saturday, April 2, 2011

ఉగాది పచ్చడి

ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పే నిజం. ‘కష్ట సుఖాలు జీవితంలో చవిచూడాలి’. కాబట్టి ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.


కావాల్సిన పదార్థాలు:
తగినన్ని మామిడి ముక్కలు,
2 టీ స్పూన్ల వేప పువ్వు,
100 గ్రాముల కొత్త చింతపండు,
30 గ్రాముల బెల్లం,
టీ స్పూను కారం,
తగినంత ఉప్పు,
అరటిపండు ముక్కలు

తయారీ విధానం:
ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆ తర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి. ఈ పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు కలపాలి. ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి సిద్ధమమైనట్లే.

Friday, March 18, 2011

రంగుల పండుగ - హోలీ!


వసంత కాలంలో వచ్చే పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.

హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.

హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథురా, బందావన్, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాలు రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు.

అలాగే దక్షయక్ష సమయందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయము చేస్తారు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు.

మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగాయెంచి అంగీకరిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు. దాంతో ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామవికారాలకు గురిచేసి పార్వతీ పరమశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు. అలాకృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు.

కానీ పరమశివుడు ఆత్మధ్యానంలో ఉన్న తాను కామవికారాలకు ఎలాలోను అయ్యానా అని దివ్యదృష్టితో చూసి కాముకుడైన మన్మధుని మూడవ నేత్రము తెరచి భస్మం చేస్తాడు. అనంతరం రతీదేవి పార్మతీ పరమేశ్వరులను పతిభిక్ష పెట్టమని రతీదేవికి మన్మధుడు అశరీరరూపంలో సజీవుడై ఉండునట్లు మాంగల్యభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ కావున దీనిని కాముని పున్నమిగా జరుపుకుంటూ ఉంటారని పురోహితులు చెబుతున్నారు.

ఈ హోలీ పండుగను మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్‌, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, మారిషస్‌, ఫిజి దేశాల్లోనూ వైభవంగా జరుపుకుంటారు.

Thursday, March 17, 2011

సత్రం భోజనం మటం నిద్ర అన్నట్లు!

కొన్ని సందర్బాలలో పని వత్తిడి వలన ఇల్లు కూడా పట్టకుండా తిరగ వలసి వస్తుంది. అటువంటి వారి పరిస్తితి వర్ణనాతీతం.

అనగా ఇంట్లో కుటుంబ సబ్యుల వద్ద లభించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వేరు. అదే విధంగా వేరే చోట వున్నప్పుడు అక్కడి వాతావరణము వేరు.

ఇటువంటి సంధర్బంలో, ఈ సామెత ఇంట్లో వాటి ఆప్యాయతా అనురాగాలను బయటి వారి పరిచయాలను బేరీజు వేస్తుంది. అంతే కాకుండా ఇంటి వాతావరణమే గొప్పదని నిరూపిస్తుంది.

Wednesday, March 16, 2011

త్యాగధనుడు పొట్టి శ్రీరాములు

ఆంధ్రమాత ముద్దు బిడ్డలైన మహా పురుషులలో ఒకరు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు సదా:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు.

పొట్టి శ్రీరాములు వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. పేదరికం వలన వారు మద్రాసు సమీపంలో పొన్నేరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆర్ధికంగా వెసులుబాటు దొరకటంతో మద్రాసులోని జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటికి చేరారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు.

ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.

1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.

1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.

చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.

బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. నేటికీ మద్రాసు జనాభాలో 40% మంది తెలుగు వారున్నారు. "మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నారు శ్రీరాములు. ఆయన ఆశయం నెరవేరలేదు.

Saturday, March 12, 2011

బీబీ నాంచారమ్మ ఎవరు ?



బీబీ నాంచారమ్మ డిల్లి సుల్తాన్ కుమార్తె.. తురుష్కులు తమ దండయాత్రలలో దేవాలయాలలోని విగ్రహాలను అపహరించే వారు. ఆ విధంగానే నారాయణపురంలోని తిరునారాయణ స్వామి విగ్రహమైన సంపత్కుమార స్వామి విగ్రహాన్ని కూడా అపహరించి డిల్లికి తీసుకుపోయారు.

ఆ విగ్రహ సౌందర్యం చూచి ఆ విగ్రహాన్ని, తన అంతఃపురములో తన వద్దనే ఉంచుకొన్నది. ఆ తరువాత కొంత కాలానికి శ్రీ రామానుజాచారి డిల్లి సుల్తాన్ని ఒప్పించి, విగ్రహాన్ని తీసుకొని తిరునారాయణపురానికి బయలుదేరారు. ఆ విగ్రహాన్ని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ కూడా స్వామి విగ్రహాన్ని అనుసరించి తిరునారాయణపురానికి బయలుదేరారు. అక్కడ ప్రతిస్టించిన స్వామి మూర్తిని విడిచి రాలేక అక్కడే స్వామి వారిలో ఐక్యం అయినది.

ఈ విధంగా ఆండాళ్ వలే స్వామిని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని తయారుచేయించి, శ్రీ రామానుజాచారి శ్రీ రంగంలో ప్రతిస్టించినారు. ఇప్పటికి ఆ బీబీ నాంచారమ్మ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.

Saturday, March 5, 2011

ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు

కొందరు ఆపదలలో ఉన్నప్పుడు ఒక విధంగా కస్టాలు తీరిన తరువాత మరో విధంగా ప్రవర్తిస్తారు అంటే కస్టాలు ఎదురైనప్పుడు వాటి నుంచి గట్టెక్కించమని తమకు తెలిసిన దేవుళ్ళని వేడుకుంటారు. కాని తరువాత ఆ కస్టాలు తీరి, సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నప్పుడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆశ్రయించిన వారి మంచితనాన్ని విస్మరిస్తారు.


ఈవిధంగా  ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం మరియు అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది.

Wednesday, March 2, 2011

శివ రాత్రి మహత్యం

శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది.

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి క్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.

అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.

పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.

ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు. తటాకము వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.

రెండవ జామునకు పెంటిజింక కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.

మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసిన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.

యింతలో యింకొక హరిణి (జింక) తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది.

ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.

మృగముల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమనికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యపలమే " అన్నాడు.

వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి " ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించింది. నీ వెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న ’స్వయంభూలింగము’ను పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపెను.

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.

Tuesday, March 1, 2011

శివాష్ఠోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామ దేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం నీల లోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూల పాణినే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్ఠాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం తిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివ ప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపా నిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణినే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినూ నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామ ప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వాజ్ఞాయ నమః
ఓం పరమాత్మయ నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఙమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే మః
ఓంహిరణ్యరేతాయనమః
ఓందుర్ధర్షాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం అహిర్బుధ్నాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మాయ నమః
ఓం సాత్త్వికాయనమః
ఓం శుధ్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరియే నమః
ఓం పూషదంతభేత్రే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదవే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామావళిః

Sunday, February 27, 2011

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి

ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అని తెలుగులో ఒక సామెత ఉంది. దీనిని అదృష్టం కలిసి రాకపోతే పరిస్థితులు తారుమారై ఈ రోజు భాగ్యవంతుడు రేపటికల్లా కటిఖ ధరిద్రుడిగా కావచ్చు, ఈ రోజుటి బికారి రేపటికి భాగ్యవంతుడు కావచ్చు గనుక మనిషిని మనిషిగా గౌరవించాలి గాని ఉన్న సంపదను చూసుకుని మిడిసిపడడం తగదు అన్న అర్ధంలో ఒక హెచ్చరికగా వాడ బడుతోంది.

Saturday, February 26, 2011

మహా శివరాత్రి

మాఘమాసంలో బహుళ చతుర్ధశిని "మహా శివరాత్రి" అంటారు. మహా శివరాత్రి మానవులందరకు పర్వదినము - అనగా గొప్ప పండుగ. చలి కాలం వెళ్ళబోతుండగా 'మహాశివరాత్రి' పండుగ దినము వస్తుంది. శివక్షేత్రములందు 'శివరాత్రి'ని పార్వతీ పరమేశ్వరుల (శివ-పార్వతుల) కళ్యాణ మహోత్సవముగా చాలా గొప్పగా జరుపుతారు.

భక్తులు ఈ పండుగనాడు తెల్లవారు ఝాముననే నిద్ర లేస్తారు. ఇళ్ళలోను, గుళ్ళలోనూ కూడ శివపూజలు, శివాభిషేకములు చేస్తారు. ఈ రోజు 'ఉపవాసం', రాత్రి 'జాగరణ 'చేస్తారు. (రాత్రి అంతా మేల్కొని శివనామ స్మరణ చేస్తూ గడపడాన్ని జాగరణ అంటారు. మరునాటి ఉదయం యధావిధి స్నాన సంధ్యలు ముగించుకొని భగవంతునికి (శివునికి) అర్పించిన ఆహారాన్ని తింటారు.)

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.

Thursday, February 24, 2011

ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి

కొంత మందికి ఇంట్లో వారి నుంచి తగిన గౌరవము, ఆదరణ లభించదు. కాని ఆ గౌరవము బయటి వారి నుంచి లభిస్తుంది. ఇటువంటి పరిస్తితులలో ఇంట్లో గౌరవం పొందక, బయట ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొనే వారి గురించి "ఇంటికి ఇత్తడి పొరుగికీ పుత్తడి" అనే సామెత చెపుతుంది.

Monday, February 21, 2011

తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది


తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలుబండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది … రాయలసీమ మనది … సర్కారు మనది … నెల్లూరు మనది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది


- రచన : సి.నారాయణరెడ్డి (చిత్రం :తల్లా! పెళ్లామా?)

చిరస్మరణీయుడు : సి.పి.బ్రౌన్

తెలుగు సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్.

1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్

1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు అక్షరాభ్యాసం చేశారు.  1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో  తెలుగు‌ భాష నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు.  1824లో వెంకటశాస్ర్తి సాయంతో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు.  బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు.

మచిలీపట్నం జిల్లాకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాలంలో మచిలీపట్నం కోర్ట్‌లో అమీనుగా ఉంటున్న తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ద్వారా ద్వారా వేమన ప్రతిని పొంది ఆ తాళపత్ర ప్రతిలోని పద్యాలను కాగితాల మీదకు ఎక్కించాడు. 1825 ఏప్రిల్ 25 నాటికి ఆ పద్యాల చిత్తు పరిష్కరణ, ఆంగ్లీకరణ ముగించాడు. 1825లో ఆయన "విష్ణు పురాణం" చదివాడు. విష్ణు పురాణంలోని అహల్య చరిత్ర ఆయనను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే మడికి సింగన ఆ ఘట్టాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వ్రాతప్రతులు పుట్టించడానికి, తీర్పు ప్రతులు సిద్ధపరచడానికి పద సూచికలు వ్రాయడానికి ఆయన కొలువులో ఎప్పుడూ 10 నుంచి 20 దాకా బ్రాహ్మణులు, శూద్రులు ఉండేవారు. ఇంతమంది విద్యావంతులు కృషిచేయబట్టే బ్రౌన్ ఆంధ్ర సాహిత్య సౌధాన్ని రూపొందించగలిగాడు.1837 లో " The Grammar of Telugu Language " అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. 1839లో ఈయన దృష్టి ద్విపద కావ్యాలపై పడింది. తెలుగు గ్రంధాలను సామాన్య కావ్యాలు, మహా కావ్యాలు అని రెండు వర్గాలుగా విభజించవచ్చన్నాడు. రామరాజు భూషణుడు రచించిన "వసుచరిత్ర"ను ఈయన అచ్చువేయించాడు. 1849లో తన స్వంత ఖర్చులతో "ఆముక్త మాల్యద" కు శబ్ద సూచిని తయారుచేయించాడు.

1849లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం మీద నుంచి క్రిందపడి కుడి చేయి బ్రొటన వ్రేలు విరగడంతో బ్రౌన్ ఎడమ చేత్తో రాయడం సాధనచేసి నిఘంటువు ప్రూఫులను ఎడమచేత్తోనే దిద్ది అచ్చెరువొరచాడు. ఈయన మొత్తం 34 సంవత్సరాలపాటు కంపెనీ సర్వీసులో భారతదేశంలో ఉండి 3 దశాబ్దాలపాటు తెసుగు భాషా సరస్వతాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. తెలుగు ప్రజలంతా తనకు చదువు చెప్పిన గురువులే అని ఎంతో వినమ్రంగా చాటిన బ్రౌన్ తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ చిరంజీవిగా వెలుగొందుతాడు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు.

Sunday, February 20, 2011

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

1. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్థిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం |2|

2. ఉత్థిష్ఠోత్థిష్ఠ గోవింద ఉత్థిష్ఠ గరుడ ధ్వజ
ఉత్థిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు |2|

3. మాత స్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షో విహారిణి మనోహర దివ్య మూర్తే
శ్రీ స్వామిని శ్రిత జన ప్రియ దాన శీల
ే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతం

4. తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే

5. అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా ః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

6. పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా ః త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

7. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా ః పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని భుక్త్వా సలీల మథ కేళి శుకా ః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

9. తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

10. భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య ః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

11. యోషా గణేన వర దధ్ని విమథ్య మానే ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా ః రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

12. పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా ః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

13. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

14. శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా ః ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

15. శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

16. సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

17. ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

18. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాస దాసా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

19. త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమా కలనయా కులతాం లభంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

20. త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

21. శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

23. కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

24. మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర శేషాంశ రామ యదునందన కల్కి రూప శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

25. ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా ః తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతం

26. భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభో విహంగాః శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతం

27. బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా ః ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా ః శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

28. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

29. ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా ః తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే!

Thursday, February 10, 2011

ఆదిత్య హృదయం


తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్,
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్. 1

దైవతై శ్చసమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్,
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. 2

రామ! రామ! మహాబాహో! శృణు గుహ్యం సనాతనమ్,
యేన సర్వా నరీన్ వత్స! సమరే విజయిష్యపి. 3

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్,
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్. 4

సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్,
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థన ముత్తమమ్. 5


రశ్మిమంతం సముద్యంతం దేవాసర నమస్కృతమ్,
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్. 6

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః,
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. 7

ఏష బ్రహ్మో చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః,
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యాపాంపతిః. 8

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః,
వాయు ర్వహ్నిః ప్రజాఃప్రాణాః ఋతుకర్తా ప్రభాకరః. 9

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్,
సువర్ణసదృశో భానుః స్వర్ణ్యరేతా దివాకరః. 10

హరిదశ్వః సహస్రార్చిః సప్తపప్తిః మరీచిమాన్,
తిమిరోన్మథనః శంభు స్త్వష్టా మార్తాండకోంశుమాన్. 11

హిరణ్యగర్భః శిశిర స్తపనో భస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్త్రః శంఖః శిశిరనాశనః. 12

వ్యోమసాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః,
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమః. 13

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః,
క(ర)వి ర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః. 14

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్! నమోస్తుతే. 15

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 16

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః,
నమో నమ స్సహస్రాంశో అదిత్యాయ నమో నమః. 17

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః,
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. 18

బ్రహ్మోశా నాచ్యుతేశాయ సూర్యా యాదిత్యవర్చసే,
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. 19

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. 20

తప్తచామీకరాభఅయ వహ్నయే విశ్వకర్మణే,
నమస్తమో ఛినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. 21

నాశయత్యేష వై భూత్ తదేవ సృజతి ప్రభుః,
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. 22

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః,
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చై వాగ్నిహోత్రిణామ్. 23

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతునాం ఫలమేవ చ,
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. 24

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ,
కీర్తయన్ పురుషః కశ్చి న్నావసీదతి రాఘవ!. 25

పూజయ స్త్వైన మోకాగ్రో దేవదోవం జగత్పతిమ్,
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. 26

అస్మిన్ క్షణే మహాబాహో! రావణం త్వం వధిష్యసి,
ఏవ ముక్త్యా తతో గస్త్యో జాగామ చ యథాగతమ్. 27

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా,
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయాతాత్మవాన్. 28

ఆదిత్యం ప్రేక్ష్యం జప్త్వేదం పరం హర్ష మవాప్తవాన్,
త్రిరాచమ్య శుచి ర్భూత్వా ధను రాదాయ వీర్యవాన్. 29

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్,
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. 30

అథ రవి రవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
విశిచరపతి సంక్షయం విదిత్వాసురగణ మధ్యగతో వచ స్త్వరేతి. 31

రధ సప్తమి


సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా!


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.

వసంత పంచమి

సరస్వతిని వేదమాతగా, భారతిగా, వాగేశ్వరిగా, శారదగా మన పూర్వీకులు అభివర్ణించారు. ఇంతటి సర్వశక్తిమయమైన జగదంబను వాగ్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తారు. ఆ తల్లిని ఆరాధించే దినమే మాఘశుద్ధ పంచమి. ఈ రోజు సరస్వతీ పూజకు ప్రశస్తంగా చెబుతారు దీనిని వసంత పంచమి అంటారు. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు.

వసంత పంచమినే శ్రీపంచమి అని కూడా పిలుస్తారు. శ్రీపంచమి దక్షిణ భారతదేశంలో అంతగా ప్రచారం లేకపోయినప్పటికీ, ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు.

మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.

Saturday, January 15, 2011

బోగ భాగ్యాల భోగి

సంక్రాంతి పండుగ మొదలయ్యిందంటే చాలు. ఇంటింటా పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. అయితే గ్రామాలతో పోల్చుకుంటే... పట్టణాల్లో సం క్రాంతి సంబరాల జోరు తక్కువే అని చెప్పవ చ్చు. ఎందుకంటే ఇది ముఖ్యంగా రైతుల పం డుగ. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి. మన సంస్కృతీ సాంప్రదాయాల్లో భోగికి ఎంతో విశిష్టత ఉం ది.


భోగి అనగానే మనకు టక్కున స్ఫురణకు వచ్చేది భోగి మంటలు. చలికాలంలో వచ్చే సంక్రాంతి పండుగకు తొలిరోజే భోగి. చలిని పారద్రోలడానికి భోగిమంటలు వేసుకొని చిన్నా పెద్దా అంద రూ కలిసి మంట ల చుట్టూ నిలబడి పాటలు పాడుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలు వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజు న భోగిమంటలు వేస్తారు.

ముఖ్యంగా ఊరిలోని నాలుగు మార్గాల కూడలిలో ఈ గ్రామస్తులంతా కలిసి పెద్ద భోగి మంటలు వేస్తారు. ఈ భోగిమంటలకంటే ఇంకా ఎక్కువ వేడితో ఉత్తరాయణం లో సూర్యుడు రాబోతున్నాడనే దానికి కూడా ఈ భోగి మంటలను చెప్పుకుంటారు.దక్షిణాయణంలో ఉండే నిద్రమత్తును భోగి మం టల్లో దగ్ధం చేయాలనే సంకల్పంతో చీకటితోనే భోగిమంటలు వేయడం సాంప్రదాయం. ఇం దులో కేవలం ఇంట్లో ఉండే పా త కలప సామానులు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేసి తగులబెడతారు. వీటన్నిటినీ దారిద్య్ర చిహ్నాలుగా భావించి తగులబ్టె డం పరిపాటి.

Thursday, January 13, 2011

భోగి పళ్ళు

భోగి పండుగ అంటే సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైన పండుగ. భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. దీనినే భోగి పళ్ళు పోయడం అంటారు. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపళ్ళు పోస్తారు. అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తా, మామ ఇలా ఇంటిల్లిపాది అంతా కలిసి భోగిపళ్ళుతో చిన్నారులను దీవిస్తారు. సకల సౌభాగ్యాలతో, నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భోగి పళ్ళు పోస్తూ పాటలు పాడతారు.