/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Friday, July 15, 2011

గురుపౌర్ణమి విశిష్ఠత

గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.

అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు.పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tuesday, July 12, 2011

తొలి ఏకాదశి పండుగ

మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.



ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు.

ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు

నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.