వసంత కాలంలో వచ్చే పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.
హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథురా, బందావన్, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాలు రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు.
అలాగే దక్షయక్ష సమయందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయము చేస్తారు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు.
మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగాయెంచి అంగీకరిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు. దాంతో ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామవికారాలకు గురిచేసి పార్వతీ పరమశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు. అలాకృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు.
కానీ పరమశివుడు ఆత్మధ్యానంలో ఉన్న తాను కామవికారాలకు ఎలాలోను అయ్యానా అని దివ్యదృష్టితో చూసి కాముకుడైన మన్మధుని మూడవ నేత్రము తెరచి భస్మం చేస్తాడు. అనంతరం రతీదేవి పార్మతీ పరమేశ్వరులను పతిభిక్ష పెట్టమని రతీదేవికి మన్మధుడు అశరీరరూపంలో సజీవుడై ఉండునట్లు మాంగల్యభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ కావున దీనిని కాముని పున్నమిగా జరుపుకుంటూ ఉంటారని పురోహితులు చెబుతున్నారు.
ఈ హోలీ పండుగను మనదేశంతోపాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్, ఇంగ్లాండ్, అమెరికా, మారిషస్, ఫిజి దేశాల్లోనూ వైభవంగా జరుపుకుంటారు.
Comments
Post a Comment