Skip to main content

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.

శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని అన్నాడు. 

తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆంధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మంచి గుర్తింపు పొందాయి. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. 

తర్వాత 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు.

తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడి (జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌)గా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకులు (విద్యాశాఖ డెరైక్టర్) వచ్చారు. ఆ ఉన్నతాధికారి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. తన పన్నెండో ఏటనే తెలుగులో కవిత్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు.

ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ప్రార్థనా గీతం. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్న శంకరంబాడి సుందరాచారిని అక్క డున్న కొంతమంది గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించారు. ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.

నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచనలు చేశారు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడుపుచూ, తాగుడుకు అలవాటు పడి సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.

శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జ్ఞాపకార్ధము 2004 సంవత్సరములో తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.

Comments

Popular posts from this blog

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, ...