/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Tuesday, December 7, 2021

విష్వక్సేనుడు: శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధిపతి

తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో విష్వక్సేనులది ప్రధాన పాత్ర. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే విష్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం చెబుతోంది. అసలు విష్వక్సేనుడు ఎవరో తెలుసుకుందాం!

శైవులు గణపతిని తొలిగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టుగానే వైష్ణవులు విష్వక్సేనుని ప్రతి కార్యంలోను పూజిస్తారు. శివ గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అయితే, విష్ణు గణాలకు అధిపతి విష్వక్సేనుడు.

కూర్మ పురాణం ప్రకారం విష్వక్సేనుడు చూడటానికి విష్ణుమూర్తిలాగానే ఉంటాడు. ఈయనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడవ చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది, నాలగవ చేతిలో గద ఉంటుంది. తన యజమాని వలె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువుకు శ్రీవత్సం ఉంటే, విష్వక్సేనుడికి అవి ఉండవు. అలాగే కాళికా పురాణం, పాంచరాత్ర గ్రంథం లక్ష్మీ తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో విశ్వక్సేనుని గురించి ప్రస్తావించబడింది.

తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం‌లో ముక్కోటి ప్రదక్షిణంలో ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విష్వక్సేనుడి ఆలయం ఉంది. సంవత్సరానికి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా విష్వక్సేనుని ఆరాధించడంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈయన కాంస్య చిహ్నాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ విధంగా చేయడం వలన విష్వక్సేనుడు ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేస్తాడని మరియు ఉత్సవాలు సజావుగా జరిగేలా చూస్తాడని భక్తులు నమ్ముతారు.

తిరుమలలోనే కాకుండా వైష్ణవ ఆలయాలు శ్రీరంగం‌లోని రంగనాథ ఆలయం, కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ దేవాలయాలలో కూడా విష్వక్సేనుకి ప్రముఖ స్థానం కలదు. శ్రీరంగం దేవాలయ ఉత్సవాల్లో ప్రధాన ఊరేగింపు ప్రారంభానికి ముందు వీధులను పరిశీలిస్తున్నట్లుగా విష్వక్సేనుని ఊరేగిస్తారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ దేవాలయం యొక్క ఆలయ ఉత్సవం బ్రహ్మోత్సవాలకు ముందు రోజున విష్వక్సేనుని ఊరేగింపుతో ప్రారంభమవుతుంది, దీనిని సేన ముదలియార్ అని పిలుస్తారు

సర్వసైన్యాధిపతి అయిన విష్వక్సేనున్ని ఎవరైతే ఆరాధిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖానస ఆగమం చెబుతోంది.