/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Friday, March 18, 2011

రంగుల పండుగ - హోలీ!


వసంత కాలంలో వచ్చే పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా దేశ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.

హోలీ పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే- హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయం.

హోలీ పండుగను భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథురా, బందావన్, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాలు రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు.

అలాగే దక్షయక్ష సమయందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయము చేస్తారు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు.

మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగాయెంచి అంగీకరిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు. దాంతో ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామవికారాలకు గురిచేసి పార్వతీ పరమశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు. అలాకృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు.

కానీ పరమశివుడు ఆత్మధ్యానంలో ఉన్న తాను కామవికారాలకు ఎలాలోను అయ్యానా అని దివ్యదృష్టితో చూసి కాముకుడైన మన్మధుని మూడవ నేత్రము తెరచి భస్మం చేస్తాడు. అనంతరం రతీదేవి పార్మతీ పరమేశ్వరులను పతిభిక్ష పెట్టమని రతీదేవికి మన్మధుడు అశరీరరూపంలో సజీవుడై ఉండునట్లు మాంగల్యభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ కావున దీనిని కాముని పున్నమిగా జరుపుకుంటూ ఉంటారని పురోహితులు చెబుతున్నారు.

ఈ హోలీ పండుగను మనదేశంతోపాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్‌, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, మారిషస్‌, ఫిజి దేశాల్లోనూ వైభవంగా జరుపుకుంటారు.

Thursday, March 17, 2011

సత్రం భోజనం మటం నిద్ర అన్నట్లు!

కొన్ని సందర్బాలలో పని వత్తిడి వలన ఇల్లు కూడా పట్టకుండా తిరగ వలసి వస్తుంది. అటువంటి వారి పరిస్తితి వర్ణనాతీతం.

అనగా ఇంట్లో కుటుంబ సబ్యుల వద్ద లభించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు వేరు. అదే విధంగా వేరే చోట వున్నప్పుడు అక్కడి వాతావరణము వేరు.

ఇటువంటి సంధర్బంలో, ఈ సామెత ఇంట్లో వాటి ఆప్యాయతా అనురాగాలను బయటి వారి పరిచయాలను బేరీజు వేస్తుంది. అంతే కాకుండా ఇంటి వాతావరణమే గొప్పదని నిరూపిస్తుంది.

Wednesday, March 16, 2011

త్యాగధనుడు పొట్టి శ్రీరాములు

ఆంధ్రమాత ముద్దు బిడ్డలైన మహా పురుషులలో ఒకరు పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు సదా:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. పొట్టి శ్రీరాములు.

పొట్టి శ్రీరాములు వారి తల్లిదండ్రులు గురవయ్య, మహాలక్ష్మమ్మ. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. పేదరికం వలన వారు మద్రాసు సమీపంలో పొన్నేరి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆర్ధికంగా వెసులుబాటు దొరకటంతో మద్రాసులోని జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటికి చేరారు. అక్కడే 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించారు.

ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.

1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోవడం జరిగింది. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.

పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.

1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.

1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.

మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు.

ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు.

చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్క రోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోటానికి వీల్లేదని మరునాడే వెళ్ళిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. అయితే కాకతీయులు పాలించిన వరంగల్లు రాజధానిగా బాగుంటుందని అంబేద్కర్ సూచించారు. రాజమండ్రి కూడా మంచిదేనన్నారు. విజయవాడ కమ్యూనిస్టుల కంచు కోట కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వొప్పుకోలేదు. నెల్లూరు, చిత్తూరు నాయకులు మాకు మద్రాసు దగ్గరగా వున్న సౌకర్యం వదులుకోవాలా అని అలిగారు. కోస్తా వాళ్ళను మేము నమ్మం,రాజధాని రాయలసీమలోనే పెట్టాలని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రమే వద్దని నీలం సంజీవరెడ్డి తదితరులు ఎదురుతిరిగారు. గత్యంతరంలేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.

బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. నేటికీ మద్రాసు జనాభాలో 40% మంది తెలుగు వారున్నారు. "మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నారు శ్రీరాములు. ఆయన ఆశయం నెరవేరలేదు.

Saturday, March 12, 2011

బీబీ నాంచారమ్మ ఎవరు ?



బీబీ నాంచారమ్మ డిల్లి సుల్తాన్ కుమార్తె.. తురుష్కులు తమ దండయాత్రలలో దేవాలయాలలోని విగ్రహాలను అపహరించే వారు. ఆ విధంగానే నారాయణపురంలోని తిరునారాయణ స్వామి విగ్రహమైన సంపత్కుమార స్వామి విగ్రహాన్ని కూడా అపహరించి డిల్లికి తీసుకుపోయారు.

ఆ విగ్రహ సౌందర్యం చూచి ఆ విగ్రహాన్ని, తన అంతఃపురములో తన వద్దనే ఉంచుకొన్నది. ఆ తరువాత కొంత కాలానికి శ్రీ రామానుజాచారి డిల్లి సుల్తాన్ని ఒప్పించి, విగ్రహాన్ని తీసుకొని తిరునారాయణపురానికి బయలుదేరారు. ఆ విగ్రహాన్ని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ కూడా స్వామి విగ్రహాన్ని అనుసరించి తిరునారాయణపురానికి బయలుదేరారు. అక్కడ ప్రతిస్టించిన స్వామి మూర్తిని విడిచి రాలేక అక్కడే స్వామి వారిలో ఐక్యం అయినది.

ఈ విధంగా ఆండాళ్ వలే స్వామిని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని తయారుచేయించి, శ్రీ రామానుజాచారి శ్రీ రంగంలో ప్రతిస్టించినారు. ఇప్పటికి ఆ బీబీ నాంచారమ్మ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.

Saturday, March 5, 2011

ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు

కొందరు ఆపదలలో ఉన్నప్పుడు ఒక విధంగా కస్టాలు తీరిన తరువాత మరో విధంగా ప్రవర్తిస్తారు అంటే కస్టాలు ఎదురైనప్పుడు వాటి నుంచి గట్టెక్కించమని తమకు తెలిసిన దేవుళ్ళని వేడుకుంటారు. కాని తరువాత ఆ కస్టాలు తీరి, సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నప్పుడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆశ్రయించిన వారి మంచితనాన్ని విస్మరిస్తారు.


ఈవిధంగా  ఆపదలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్మరించి, ఆపదల నుంచి బయటపడ్డ నాడు దేవుని మరవటం అన్నది స్వార్థం మరియు అవకాశవాదం అని ఈ సామెత ద్వారా తెలుయుచున్నది.

Wednesday, March 2, 2011

శివ రాత్రి మహత్యం

శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది.

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి క్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.

అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.

పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.

ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు. తటాకము వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.

రెండవ జామునకు పెంటిజింక కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.

మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసిన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.

యింతలో యింకొక హరిణి (జింక) తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది.

ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.

మృగముల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమనికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యపలమే " అన్నాడు.

వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి " ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించింది. నీ వెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న ’స్వయంభూలింగము’ను పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపెను.

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.
పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు
బలగర్వ మొప్పంగ బై లేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు పండరంగు
బంచిన సామంత పడువతో బోయి
కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి
గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి
కట్టె దుర్గంబు గడు బయల్సేసి,
కందుకూర్బెజవాడ గావించి మెచ్చి
దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.

Tuesday, March 1, 2011

శివాష్ఠోత్తర శతనామావళిః

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామ దేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం నీల లోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూల పాణినే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్ఠాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం తిలోకేశాయ నమః
ఓం శితికంఠాయ నమః
ఓం శివ ప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారినే నమః
ఓం అంధకాసురసూదనాయ నమః
ఓం గంగాధరరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపా నిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపాణినే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినూ నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామ ప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వాజ్ఞాయ నమః
ఓం పరమాత్మయ నమః
ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఙమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే మః
ఓంహిరణ్యరేతాయనమః
ఓందుర్ధర్షాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తివాసాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం అహిర్బుధ్నాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మాయ నమః
ఓం సాత్త్వికాయనమః
ఓం శుధ్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయ నమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరియే నమః
ఓం పూషదంతభేత్రే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదవే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామావళిః