/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, October 21, 2019

అప్సరస: ఊర్వశి

దేవెంద్రుని అమరావతిలో దేవతల ఆనందం కోసం నియమింపబడిన అప్సరసలలో ఊర్వశి ఒకరు. ఈమె ఒక అప్సరస. ఈమె పుట్టకముందు దేవలోకంలో రంభ, తిలోత్తమ, మేనక ఇత్యాది అప్సరసలు ఉండేవారు.

ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం బదరికావనంలో నర, నారయణులు లోక కళ్యాణం గూర్చి ఘోర తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు వలన అభద్రతా బావనకు గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తమ తదితర అప్సరసలను పంపాడు. అందగత్తెలైన రంభాది అప్సరసలు బదరికావనం చేరి తమ నృత్య, గాన విలాసాలతో నర, నరాయణుల తపస్సును భగ్నం చెయ్యడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అంతట ఇంద్రుని గర్వమనచడానికి నారాయణుడు తన కుడి ఊరువు (తొడ) మీద అరచేత్తో చరచాడు. ఆ శబ్దం నుంచి ఒక అప్సరసల అందాన్ని తలదన్నే అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊరువు నుంచి పుట్టినది కనుక ఆమెకు ‘ఊర్వశి’ అని పేరుపెట్టి, ఆమెను రంభాది అప్సరసలకు అప్పగిస్తూ ‘ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహూకరించామని చెప్పండి’ అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి, తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా నారాయణుని కుమార్తె అయిన ఊర్వశి అప్సరసల్లో స్థానం సంపాదించుకుంది.

ఒకసారి దేవలోకం‌లో ఊర్వశిని సూర్యుడు (మిత్రుడు), వరుణుడు చూడటం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా వారి తేజస్సును ఊర్వశి కుండలలో భద్రపరిచినది. అలా మిత్రావరుణులకు పుట్టిన వారే వశిష్ట, అగస్త్యులు. వీరు కుండల నుండి ఉద్బవించుట వలన వీరిని కుంభసంభవులంటారు. అయితే వరుణునితో కలిసినందున భంగపడిన మిత్రుడు ఊర్వశిని భూలోకం‌లో పురూరవునికి బార్యగా పుట్టమని శపించాడు.

పురూరవుడు చంద్రవంశానికి చెందిన రాజు. ఆయన తల్లిదండ్రులు బుధుడు, మనువు కూతురైన ఇళ. ఒకనాడు భూలోకం‌లో ఊర్వశిని పురూరవ చక్రవర్తి చూడటం తటస్థించింది. ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుని చేయగా, పురూరవుడు తనను వివాహం చేసుకొమ్మని ఊర్వశిని అర్థించాడు. వివాహానికి సమ్మతించిన ఊర్వశి కొన్ని నిబంధనలుపెట్టింది. అమె తన వెంట తీసుకువచ్చిన జింకపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని మరియు దిగంబరంగా ఎప్పుడూ నా కంటబడకూడదని ఈ నిబంధనలను అతిక్రమించిన క్షణమే తను స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇందుకు సమ్మతించిన పురూరవుడు ఆమెను వివాహాం చేసుకొని, ప్రేమగా జీవించసాగారు. మరోవైపు వీరి ప్రేమ దేవతలకు అసూయగా మారింది. ఊర్వశి లేకపోవడంతో స్వర్గ లోకం‌ చాలా వెలితిగా కనిపించింది. దీనితో ఊర్వశిని స్వర్గానికి రప్పించాలని దేవతలు ఒక పన్నాగం పన్నుటకు నిశ్చయించుకున్నారు. ఆ పన్నాగం ప్రకారం ఒకనాటి రాత్రి ఊర్వశి, పురూరవుడు ఏకశయ్యాగతులై ఉండగా దేవేంద్రునిచేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్యరూపంలో ఊర్వశి జింకపిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరవుని నిందించగా, అతడు ఆమెను ఓదార్తూ తనున్న స్థితిని మరచి శయ్య దిగాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలా దేవేంద్రుడు మెరుపులు సృష్టించగా, ఊర్వశి ఆ మెరుపుల వెలుగులో పురూరవుని దిగంబరంగా చూసింది. ఈ విధంగా వీరి వివాహపు నిబంధన అతిక్రమించబడి పురూరవుడు ఎంతగా బ్రతిమాలుతున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు పుట్టరు.

మహా భారతం‌లో కూడా ఊర్వశి గురించి ప్రస్థావన ఉంది. అరణ్యవాసం సమయం‌లో అర్జునుడు ఇంద్రకీలపర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ సమయం‌లో దేవతలకు బాధకులుగా ఉండిన కాలకేయ నివాతకవచులను వధించుటకై ఇంద్రుని ఆహ్వానం మేరకు అర్జునుడు స్వర్గానికి అతిధిగా వెళ్ళాడు. అక్కడ ఇంద్రుని సలహా మేరకు చిత్రసేనుడి వద్ద శిష్యునిగా చేరి నాట్యం నేర్చుకోసాగాడు. అప్పుడు దేవ నర్తకి అయిన ఊర్వశి అర్జునుడిని మోహించగా, అర్జునుడు అమెతో "మీరు మా వంశకర్త అయిన పురూరవుని బార్య, అంతేకాక నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేసుంటారు. మీరు నాకు తల్లితో సమానం” అని తిరస్కరిస్తాడు. దీనికి ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడికి నపుంసకత్వము కలుగునట్లు శపించెను. ఈ విషయము ఇంద్రునికి తెలియగా, ఆ శాపము అర్జునుడి అజ్ఞాతవాస కాలమున అనుభవించునట్లును, తదనంతరము శాపవిమోచనము కలుగునట్లు అనుగ్రహించెను. నాటి ఈ శాపమే అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా విరాటుని కొలువులో బృహన్నల విరాటుని కుమార్తెన ఉత్తరకి నాట్యం నేర్పేను. ఉత్తర గోగ్రహణ సమయం‌లో అర్జునుడు ఈ శాపం నుండి విముక్తిపొందాడు.