/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Saturday, April 20, 2019

దేవవైద్యుడు ధన్వంతరి

హిందూమతంలో దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది.

క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. ఇందులో తొలుతగా హాలాహ‌లం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థముంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అన్న పేరు కూడా ఉంది.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు.

అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే మూలం కావడం విశేషం.

ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం"లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి. తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో కూడా ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.