బతుకమ్మ పండుగ తెలంగాణా ప్రాంతములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.
ఈ బతుకమ్మ పండుగ వెనుక చాల కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నదిది : ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం "బతుకమ్మా !" అని దీవించారంట అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన, బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదనీ, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలనీ గౌరమ్మను ప్రార్ధిస్తారు.
ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతియై లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది కావున ఈమె తల్లితండ్రులు బతుకమ్మా అని నామకరణము చేసినారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆన్వాయితీ అయ్యిందని ఈ కథ చెబుతున్నది.
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.
Comments
Post a Comment