శివరాత్రి మహత్యమును తెలుపు కథలు స్కంథ పురాణమునందును లింగపురాణము నందును పెక్కు కలవు. ఈ కథ లింగపురాణము లోనిది.
ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కబుర్లాడు కొంటూన్నారు. "దేవదేవేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ద కర్మలతో పెక్కు బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞయాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి క్తిని ముక్తిని కలుగునట్లు చేయుము" అని పార్వతి అన్నది.
అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రివ్రతము అనునది ఒకటి ఉంది. సర్వయఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను.
పూర్వము ఒక పర్వత ప్రాంతమున ’వ్యాథు’ డనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక ’మృగము’ ను చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది.
ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క ’మృగము’ కంటపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్ప లేదు. అయినా చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక తటాకము కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు. తటాకము వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ తటాకము వైపు చూస్తూ కూర్చున్నాడు.
మొదటి జామునకు ఒక పెంటిలేడి నీరు త్రాగటానికి ఆ తటాకము దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయినాడు. "వ్యాథుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నీకు అవథ్యను. నా వలన నీ కుటుంబానికి సరిపడు భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు.యింకొక "పెంటిజింక" కాసేపటిలో ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అంది. "సరే" అన్నాడు వేటగాడు.
రెండవ జామునకు పెంటిజింక కనిపించింది. మొదటి జింకే అనుకున్నవేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ ధనుర్దారుడా! ముందు నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మేదోమాంసములు లేవు.నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగాబలిసిన "మగజింక" ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు.
మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు.బలిసిన మగజింక రానేవచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే అల్లెత్రాడు లాగి బాణము విడువబోవునంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలినికూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ మహాసత్త్వుడా రెండు పెంకిజింకలు ఇక్కడకు వచ్చినవా!? అవి ఎటు పోయినవీ? వానిని నీవు చంపితివా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి వలనే ఆశ్చర్యపడిరెండు "తిరిగి వస్తానని ప్రతిఙ చేసి వెళ్ళాయి.నిన్ను నాకు ఆహారంగా పంపాయి" అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది.
యింతలో యింకొక హరిణి (జింక) తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది.
ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయమయింది. వ్యాదుడు జింక కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాదుని ఎదుట మోకరిల్లాయి.
మృగముల సత్యనిష్ఠకు వ్యాధుడు ఆశ్చర్య పడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు. తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. కానున్నది కాకమానదు. ఈ విధంగా మృగాలను వేటాడి బందించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమనికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను.ధర్మములకు దయ మూలము. దయ చూపుటకూడ సత్యపలమే " అన్నాడు.
వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు మనోహరమయిన విమానములో వచ్చి " ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున నీ పాపము నశించింది. నీ వెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న ’స్వయంభూలింగము’ను పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.
ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి ’దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపెను.
Comments
Post a Comment