/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, January 4, 2010

బమ్మెర పోతన

బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరి భాగవతము తో తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించినారు. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని కథ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించినారు. ఈ భాగవతము మొత్తము తెలుగు తనము ఉట్టిపడుతుంది. వీరభద్ర విజయము, భోగినీ దండకము వీరి ఇతర రచనలు.

పోతన, శ్రీనాధ కవిసార్వభౌముడు సమకాలికులు, బంధువులు అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాధలు ప్రచారములో ఉన్నాయి. పోతన వ్యవసాయము చేసి జీవనము సాగించినవారు. "పట్టునది కలమొ, హలమొ - సేయునది పద్యమో, సేద్యమో" అని "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చమత్కరించిరి. కవిత్వమును రాజులకో, కలిగినవారికో అంకితమిచ్చి, వారిచ్చిన సొమ్ములు, సన్మానములు స్వీకరించుట అప్పటి సంప్రదాయము. కాసు కోసము ఆసపడి తన "బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకను" క్రూరులైన రాజుల పరము జేయుటకు పోతన అంగీకరింపలేదు. ఆయన తన కవిత్వము శ్రీరామునకే అంకితము చేసిన పరమ భాగవతోత్తములు.

పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.