/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Friday, December 25, 2020

ముక్కోటి ఏకాదశి విశిష్టత


ప్రతి ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు.

Sunday, April 26, 2020

అప్సరస: తిలోత్తమ

తిలోత్తమ దేవెంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం రాక్షసుడైన హిరణ్యకశిపుని వంశాన పుట్టిన నికుంభుడు అనే రాక్షసరాజుకి సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు కుమారులు కలరు. వీరిరువురూ ఎంత అన్యోన్యంగా ఉండటం వలన వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేవారు. ప్రపంచమంతా జయించాలన్న కోరికతో వింధ్యా పర్వతం మీద ఘోర తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మ దేవుడు సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమనగా “మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. అంతేకాక ఎవరివల్లా మాకు మరణం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించమని” కోరారు. అంతట బ్రహ్మ దేవుడు “అన్యులచే (పరులచే) మీకు మరణం రాదు” అని వరమిచ్చి అదృశ్యుడైనాడు.

బ్రహ్మ దేవుని వరంతో రాక్షసులైన సుందోపసుందుల ఆగడాలకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారిని ఎదిరించే వారు ఎవ్వరూ లేకపోవడంతో వీరు ముల్లోకాలను జయించి దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులను హింసించసాగెను. వీరి అకృత్యాలకు ముల్లోకాల వాసులంతా హడలిపోయారు. దీంతో దిక్కుతోచని దేవతలు, రుషులు బ్రహ్మ దేవుని ప్రార్ధించగా, ‘అన్యుల చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే కాని వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందని’ పలికెను. మరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్యోన్యంగా ఉండే సోదరుల మధ్య ముసలం పుట్టించేదెలా! అందుకోసం బ్రహ్మ దేవుడు ఆలోచించి విశ్వకర్మను పిలిచి లోకములోకెల్లా సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆజ్ణానుసారం ముల్లోకాలలో ఉన్న అన్ని అందమైన రూపాలలో ఒక్కొక్క దాని నుంచి నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశిని సృష్టించగా, బ్రహ్మ దేవుడు ఆమెకు ప్రాణప్రతిష్ట చేసెను. “తిలా” అనగా నువ్వు గింజ మరియు “ఉత్తమ” అంటే అత్యుత్తమమైనది అని అర్ధం. నువ్వు గింజ పరిమాణంలో తీసి అత్యున్నత లక్షణాలతో ఆమె శరీరాన్ని నిర్మించుట చేత బ్రహ్మ ఆమెకు ‘తిలోత్తమ’ అని నామకరణం చేసెను. అంతట ఆ సుందరి లేచి నమస్కరించి తన సృష్టికార్యం ఏమిటని అడగగా, నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం వచ్చి ఇద్దరూ ఒకరినొకరు సంహరించుకోవాలని చెప్పెను.

అంత బ్రహ్మా ఆదేశంతో తిలోత్తమ వెళ్లి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. తిలోత్తమ అందాన్ని చూసి మోహితులైన సుందోపసుందుల అమె నాదంటే నాదని గొడవపడ్డారు. వారిలో క్రోధం పెరిగిపోయంది. తిలోత్తమను పొందడానికి పోటీపడి అంతవరకూ ఎంతో వాత్సల్యంతో ఉన్న ఆ సోదరులు వారి వరాలను వారు మరిచిపోయారు. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో అన్నదమ్ముల మైత్రి ఆమడదూరం పోయంది. ఎవరికి వారు గొప్ప అనుకొన్నారు. పట్టుదలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకొని చివరకు ఇద్దరు మరణించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం అనే బలహీనత కలహానికి కారణమై వారి పతనానికి దారి తీసిందో సుందోపసుందుల కథ చెబుతోంది.

Thursday, April 2, 2020

ఏకశ్లోక రామాయణం




ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనం
వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణమ్
వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణనిధనం హ్యేతర్ధి రామాయణమ్!!