/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Wednesday, May 26, 2021

వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని “వైశాఖ పూర్ణిమ” అని పిలుస్తారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసము దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవడంతో వారు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహా విష్ణువు కూర్మ అవతారం రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును “ కూర్మ జయంతి” అంటారు.

అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ‌ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కుడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే.


ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అహింసే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లుంబినీ (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది)లో సిద్దార్ధునిగా జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కులీన శాక్య వంశానికి చెందిన సుద్దోదన మహరాజు, రాణి మాయదేవి. అయితే గౌతముడు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి మరణించగా, పిన తల్లి గౌతమి అనే మహిళ పెంచడం వలన గౌతముడనే పేరుతో కూడా పిలుస్తారు. యాదృచ్ఛికంగా చాలా రోజుల తరువాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడికి గయలోని బోధి (రావి) చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందువల్లే వైశాఖ పూర్ణిమ “బుద్ధ పూర్ణిమ”గా ప్రసిద్ధి చెందింది. అలాగే మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు బౌద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోధ్ గయ మరియు వారణాసి సమీపంలో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన కుషినగర్‌లలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

నేటికి రెండున్నర వేల సంవత్సరములు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా బుద్దుడు తన అహింస ధర్మముతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, బర్మా, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ పలు దేశాల్లో బౌద్ధం విస్తరించి విరాజిల్లుతోంది.

Thursday, May 20, 2021

జరాసంధుని ఇతివృత్తం

జరాసంధుడు మహాభారతంలో ఒక విచిత్రమైన పుట్టుక కలిగినవాడు. కృష్ణుడంతటి వాడిని జయించిన వీరుడు జరాసంధుడు. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు - ఈ అయిదుగురు ఒకే నక్షత్రంలో జన్మించడం వలన వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. ముందుగా బకాసురుడు పాండవులు ఏకచక్రపురంలో నివసిస్తున్న సమయంలో భీముని చేతిలో సం‌హరింపబడగా, క్రమంగా మిగిలిన ముగ్గురు భీమునిచే వధింపబడినారు.

జరాసంధుని పుట్టుక:

మగధ దేశానికి రాజైన బృహద్రధుడుకి ఇద్దరు భార్యలు. వారి వలన అతనికి సంతానము లేకపోవడంచో, బృహద్రధుడు సంతానం కొరకు చందకౌశిక అనే మహర్షిని ప్రార్ధించెను. ఆ ఋషి బృహద్రధునికి ఇద్దరు భార్యలు అని తెలియక, ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. ఆ పండును బృహద్రధుడు తన ఇద్దరు భార్యలకు సమానంగా విభజించి తినిపించాడు. పండు సగ భాగాల్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు కొంతకాలానికి శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దిగ్భ్రాంతికి గురైన మహారాజు ఆ శిశు భాగాలను బయట పడవేసి రమ్మని తన సేవకులను ఆదేశించగా, ఆ సేవకులు బయట విసిరివేస్తారు.

ఆ రాజ్యములో జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ ఈ రెండు భాగాలను ఒకటిగా చేసి కలిపి తినడానికి ప్రయత్నించిగా, ఆ శిశువుకి ప్రాణం వచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ రాక్షసి జరిగిన విషయాన్ని రాజుకి చెప్పి ఆ పిల్లాడిని అప్పగించి “అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరి వేస్తే తప్ప, ఎవరూ సంహరించలేరు” అనే వరాన్ని కూడా ప్రసాదించింది. జరా అనే రాక్షసి చేత సంధించబడ్డాడు కాబట్టి రాజు కృతజ్ఞతతో ఆ పిల్లవాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు.

తండ్రి అరణ్యవాసానంతరం జరాసంధుడు మగధ దేశానికి రాజయ్యాడు. సహజంగానే మల్ల యుద్ధ ప్రవీణుడైన జరాసంధుడు మహా బలవంతుడు మరియు పరమ శివ భక్తుడు. తన రాజ్యమున శత్రువులు ఎవరైనా ప్రవేశిస్తే దానంతటదే మోగే భేరీపటలము ఏర్పాటు చేసి, తన రాజ్యములో ప్రవేశించిన శత్రువులను అంతము చేసేవాడు. తన కుమార్తెలు అయిన అస్తీ, ప్రాస్తీ లిద్దరిని కంసునికిచ్చి వివాహంచేసి కంసున్ని అల్లునిగా చేసుకున్నాడు. కంసున్ని చంపిన శ్రీ కృష్ణుని సంహరించే క్రమంలో భాగంగా జరాసంధుడు పదిహేడు సార్లు యుద్ధానికి ప్రయత్నించి ఓడిపోయాడు. అంతిమంగా పద్దెనిమిదవసారి మాత్రం శ్రీ కృష్ణుని ఓడించి పగ తీర్చుకున్నాడు.

ధర్మరాజు రాజసూయ యాగము చేయుటకు నిశ్చయించుకొని శ్రీ కృష్ణునికి అగ్ర తాంబూలం అంటే మహా చక్రవర్తిగా ప్రకటించి పూజించాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వడాన్ని అంగీకరించని జరాసంధుడుని సం‌హరించుటకు ధర్మరాజు కృష్ణుని సహాయం కోరెను. శ్రీ కృష్ణుడు భీమార్జునులతో కలసి బ్రాహ్మణ వేషమున జరాసంధుని వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణ భక్తి కలిగిన వచ్చిన వారిని బ్రాహ్మణులనుకొని జరాసంధుడు వారికి నమస్కరించి ఏమి కావాలో కోరుకోమన్నాడు. అంతట శ్రీ కృష్ణుడు తాము బ్రాహ్మణులం కాదని అసలు విషయం చెప్పి తమతో మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. మల్ల యుద్దం నాలుగు రోజుల పాటు భీకరంగా కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. శ్రీ కృష్ణుడు జరాసంధుని సంహరించడానికి సూచనగా భీమునికి కనపడేలా ఒక గడ్డి పరకను రెండు ముక్కలుగా చేసి వ్యతిరేక దిశలలో విసిరేశాడు. శ్రీ కృష్ణుని సూచనతో భీముడు జరాసం‌ధుడి శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి సంహరించాడు. రెండు భాగాలు కలిసి ప్రాణాన్ని పొందిన జరాసంధుడు రెండుగా విడిపోయి మరణించాడు.