/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Friday, August 20, 2010

వరలక్ష్మి వ్రత కథ

పూర్వం మగధ రాజ్యంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే పేద బ్రాహ్మణ వివాహిత ఉండేది. ఆమె తన పతికి, అత్త మామలకు భక్తి తో సేవ చేసేది. ఒక రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ వరలక్ష్మి దేవి కనిపించి “భక్తురాలా! నేను వరలక్ష్మి మాతను, నీ సత్ప్రవర్తనను చూసి నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్ష మయ్యాను. ఈ శ్రావణ మాస పూర్ణిమ కు ముందు వచ్చే శుక్రవారం నాడు నా పూజావ్రతం చేస్తే నీవు, నీ ఇల్లు, నీ వారు, నీ పట్టణమే కాదు, నీవు నివసించే రాజ్యం కూడా సర్వ సంపదలతో తులతూగుతుంది” అని చెప్పి అదృశ్య మయ్యింది. కళ్ళు తెరిచి చూసిన చారుమతికి అమ్మ కనిపించలేదు. వెంటనే ఆమె తన అత్త మామలతో జరిగిందంతా చెప్పగానే “ఇది ఎంతో శుభకరమైన స్వప్నం. తల్లి చెప్పినట్టుగానే మనం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నోచుకుందాం” అన్నది ఆమె అత్త.

లక్ష్మి మాత చెప్పిన రోజు రానే వచ్చింది. ఇల్లంతా పేడతో అలికి, ఇంటి నిండా ముగ్గులు పరిచి, శోభాయమానంగా తీర్చిదిద్దారు. అందరూ పట్టుబట్టలు కట్టుకుని పూజకు సిద్దమయ్యారు. ముందుగా గణపతి పూజ పూర్తి చేసి, లక్ష్మి దేవి ని ఆవాహన చేసి అష్టోత్తరాలు, షోడశోపచారాలతో, సహస్రనామార్చన గావించి నైవేద్యం పెట్టి తల్లి దీవెనలు అందుకున్నారు. ముత్తయిదువ లను పిలిచి పేరంటం ఇచ్చి, వరలక్ష్మి వ్రాత మహిమ మరియు వ్రతవిధానాన్ని వివరించారు. చారుమతి కుటుంబం, ఆ పట్టణ ప్రజలు, ఆ రాజ్య ప్రజలు అప్పటినుండి కరువు కాటకాలు లేక సమృద్ధి యైన పాడి పంటలతో చల్లగా జీవించసాగారు. అందరు స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని వేచి చూడసాగారు.

వరలక్ష్మి వ్రత కథ ను పరమేశ్వరుడు పార్వతికి వివరించినట్టు సూత మహా ముని తన శిష్యులకు వివరించెను.