/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Sunday, April 26, 2020

అప్సరస: తిలోత్తమ

తిలోత్తమ దేవెంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం రాక్షసుడైన హిరణ్యకశిపుని వంశాన పుట్టిన నికుంభుడు అనే రాక్షసరాజుకి సుందుడు, ఉపసుందుడు అని ఇద్దరు కుమారులు కలరు. వీరిరువురూ ఎంత అన్యోన్యంగా ఉండటం వలన వారిద్దరినీ కలిపి ‘సుందోపసుందులు’ అని ఒకే పేరుతో వ్యవహరించేవారు. ప్రపంచమంతా జయించాలన్న కోరికతో వింధ్యా పర్వతం మీద ఘోర తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి బ్రహ్మ దేవుడు సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమనగా “మాకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోవాలి. ఏ మాయ చేయాలంటే ఆ మాయను చేయగలగాలి. అంతేకాక ఎవరివల్లా మాకు మరణం లేకుండా అమరత్వాన్ని ప్రసాదించమని” కోరారు. అంతట బ్రహ్మ దేవుడు “అన్యులచే (పరులచే) మీకు మరణం రాదు” అని వరమిచ్చి అదృశ్యుడైనాడు.

బ్రహ్మ దేవుని వరంతో రాక్షసులైన సుందోపసుందుల ఆగడాలకి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారిని ఎదిరించే వారు ఎవ్వరూ లేకపోవడంతో వీరు ముల్లోకాలను జయించి దేవతలు, గంధర్వులు, నాగులు, యక్షులను హింసించసాగెను. వీరి అకృత్యాలకు ముల్లోకాల వాసులంతా హడలిపోయారు. దీంతో దిక్కుతోచని దేవతలు, రుషులు బ్రహ్మ దేవుని ప్రార్ధించగా, ‘అన్యుల చేతుల్లో వారికి మరణం ఉండదని వరమిచ్చిన మాట నిజమే కాని వారిలో వారు కొట్టుకు చచ్చే అవకాశం ఉందని’ పలికెను. మరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్యోన్యంగా ఉండే సోదరుల మధ్య ముసలం పుట్టించేదెలా! అందుకోసం బ్రహ్మ దేవుడు ఆలోచించి విశ్వకర్మను పిలిచి లోకములోకెల్లా సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆజ్ణానుసారం ముల్లోకాలలో ఉన్న అన్ని అందమైన రూపాలలో ఒక్కొక్క దాని నుంచి నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశిని సృష్టించగా, బ్రహ్మ దేవుడు ఆమెకు ప్రాణప్రతిష్ట చేసెను. “తిలా” అనగా నువ్వు గింజ మరియు “ఉత్తమ” అంటే అత్యుత్తమమైనది అని అర్ధం. నువ్వు గింజ పరిమాణంలో తీసి అత్యున్నత లక్షణాలతో ఆమె శరీరాన్ని నిర్మించుట చేత బ్రహ్మ ఆమెకు ‘తిలోత్తమ’ అని నామకరణం చేసెను. అంతట ఆ సుందరి లేచి నమస్కరించి తన సృష్టికార్యం ఏమిటని అడగగా, నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం వచ్చి ఇద్దరూ ఒకరినొకరు సంహరించుకోవాలని చెప్పెను.

అంత బ్రహ్మా ఆదేశంతో తిలోత్తమ వెళ్లి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. తిలోత్తమ అందాన్ని చూసి మోహితులైన సుందోపసుందుల అమె నాదంటే నాదని గొడవపడ్డారు. వారిలో క్రోధం పెరిగిపోయంది. తిలోత్తమను పొందడానికి పోటీపడి అంతవరకూ ఎంతో వాత్సల్యంతో ఉన్న ఆ సోదరులు వారి వరాలను వారు మరిచిపోయారు. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారిలో అన్నదమ్ముల మైత్రి ఆమడదూరం పోయంది. ఎవరికి వారు గొప్ప అనుకొన్నారు. పట్టుదలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకొని చివరకు ఇద్దరు మరణించారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం అనే బలహీనత కలహానికి కారణమై వారి పతనానికి దారి తీసిందో సుందోపసుందుల కథ చెబుతోంది.