/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Thursday, August 19, 2010

శ్రావణ శుక్రవారము

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని కొలిచే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.

గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.

ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారమైన నేడు అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.