తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, July 3, 2017

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి.

మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేక ఉంది. భారతీయ నెలల పేర్లు చంద్రుని ప్రయాణాన్ని అనుసరించి ఏర్పాటయ్యాయి. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. వర్షాలు జన జీవనానికి హర్షం. నీరు అనేది అమృత తుల్యం. నీరు లేనిదే పంటలు పండువు. తిండి ఉండదు. అటు వంటి వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఆషాఢ మాసమే. ఈ నెల నుంచే వర్షంతో పాటు వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో పాటు దక్షిణ యాణం వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో పాద రక్షలు, గొడుగు, ఉప్పు ధానం చేయాలట. పైగా దక్షిణ యానం పితృ దేవతలకు ప్రీతికరమని అందుకే తర్పణాలు వదిలితే ఎంతో పుణ్యం వస్తుంది.

వధూవరుల వియోగం

పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో కోడలు గర్భం దాల్చిదే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అప్పుడు వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడల్ని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘసందేశం అనేకావ్యాన్ని రచించారు.

సౌజన్యం: ఈనాడు డాట్ నెట్

Thursday, November 3, 2016

నాగుల చవితి ప్రాశస్త్యం


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు (నాగుల చవితి) నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.

హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు. '

ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.

నాగారాధన ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంది. సర్పం వర్షాధిదేవత అని రెడ్‌ ఇండియన్ల నమ్మకం. రోమన్లు పసాన అనే జాతి సర్పాన్ని సౌభాగ్య దేవతగా పరిగణిస్తారు. యూదులు, అరబ్బులు కూడా పాములను కూపాధిష్ఠాన దేవతలని నమ్మేవారు. అవి నదులను వాగులను ప్రవాహాలతో నింపగలవని విశ్వాసం. సర్పాలు పంటలను కాపాడే దైవాలుగా, నిధి నిక్షేపాలకు రక్షకులుగా కూడా భావిస్తారు.