/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, October 21, 2019

అప్సరస: ఊర్వశి

దేవెంద్రుని అమరావతిలో దేవతల ఆనందం కోసం నియమింపబడిన అప్సరసలలో ఊర్వశి ఒకరు. ఈమె ఒక అప్సరస. ఈమె పుట్టకముందు దేవలోకంలో రంభ, తిలోత్తమ, మేనక ఇత్యాది అప్సరసలు ఉండేవారు.

ఈమె పుట్టుక గురించి ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం బదరికావనంలో నర, నారయణులు లోక కళ్యాణం గూర్చి ఘోర తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు వలన అభద్రతా బావనకు గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తమ తదితర అప్సరసలను పంపాడు. అందగత్తెలైన రంభాది అప్సరసలు బదరికావనం చేరి తమ నృత్య, గాన విలాసాలతో నర, నరాయణుల తపస్సును భగ్నం చెయ్యడానికి శతవిధాలుగా ప్రయత్నించారు. అంతట ఇంద్రుని గర్వమనచడానికి నారాయణుడు తన కుడి ఊరువు (తొడ) మీద అరచేత్తో చరచాడు. ఆ శబ్దం నుంచి ఒక అప్సరసల అందాన్ని తలదన్నే అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊరువు నుంచి పుట్టినది కనుక ఆమెకు ‘ఊర్వశి’ అని పేరుపెట్టి, ఆమెను రంభాది అప్సరసలకు అప్పగిస్తూ ‘ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహూకరించామని చెప్పండి’ అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి, తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా నారాయణుని కుమార్తె అయిన ఊర్వశి అప్సరసల్లో స్థానం సంపాదించుకుంది.

ఒకసారి దేవలోకం‌లో ఊర్వశిని సూర్యుడు (మిత్రుడు), వరుణుడు చూడటం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా వారి తేజస్సును ఊర్వశి కుండలలో భద్రపరిచినది. అలా మిత్రావరుణులకు పుట్టిన వారే వశిష్ట, అగస్త్యులు. వీరు కుండల నుండి ఉద్బవించుట వలన వీరిని కుంభసంభవులంటారు. అయితే వరుణునితో కలిసినందున భంగపడిన మిత్రుడు ఊర్వశిని భూలోకం‌లో పురూరవునికి బార్యగా పుట్టమని శపించాడు.

పురూరవుడు చంద్రవంశానికి చెందిన రాజు. ఆయన తల్లిదండ్రులు బుధుడు, మనువు కూతురైన ఇళ. ఒకనాడు భూలోకం‌లో ఊర్వశిని పురూరవ చక్రవర్తి చూడటం తటస్థించింది. ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుని చేయగా, పురూరవుడు తనను వివాహం చేసుకొమ్మని ఊర్వశిని అర్థించాడు. వివాహానికి సమ్మతించిన ఊర్వశి కొన్ని నిబంధనలుపెట్టింది. అమె తన వెంట తీసుకువచ్చిన జింకపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని మరియు దిగంబరంగా ఎప్పుడూ నా కంటబడకూడదని ఈ నిబంధనలను అతిక్రమించిన క్షణమే తను స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇందుకు సమ్మతించిన పురూరవుడు ఆమెను వివాహాం చేసుకొని, ప్రేమగా జీవించసాగారు. మరోవైపు వీరి ప్రేమ దేవతలకు అసూయగా మారింది. ఊర్వశి లేకపోవడంతో స్వర్గ లోకం‌ చాలా వెలితిగా కనిపించింది. దీనితో ఊర్వశిని స్వర్గానికి రప్పించాలని దేవతలు ఒక పన్నాగం పన్నుటకు నిశ్చయించుకున్నారు. ఆ పన్నాగం ప్రకారం ఒకనాటి రాత్రి ఊర్వశి, పురూరవుడు ఏకశయ్యాగతులై ఉండగా దేవేంద్రునిచేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్యరూపంలో ఊర్వశి జింకపిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరవుని నిందించగా, అతడు ఆమెను ఓదార్తూ తనున్న స్థితిని మరచి శయ్య దిగాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలా దేవేంద్రుడు మెరుపులు సృష్టించగా, ఊర్వశి ఆ మెరుపుల వెలుగులో పురూరవుని దిగంబరంగా చూసింది. ఈ విధంగా వీరి వివాహపు నిబంధన అతిక్రమించబడి పురూరవుడు ఎంతగా బ్రతిమాలుతున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు పుట్టరు.

మహా భారతం‌లో కూడా ఊర్వశి గురించి ప్రస్థావన ఉంది. అరణ్యవాసం సమయం‌లో అర్జునుడు ఇంద్రకీలపర్వతంపై తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఆ సమయం‌లో దేవతలకు బాధకులుగా ఉండిన కాలకేయ నివాతకవచులను వధించుటకై ఇంద్రుని ఆహ్వానం మేరకు అర్జునుడు స్వర్గానికి అతిధిగా వెళ్ళాడు. అక్కడ ఇంద్రుని సలహా మేరకు చిత్రసేనుడి వద్ద శిష్యునిగా చేరి నాట్యం నేర్చుకోసాగాడు. అప్పుడు దేవ నర్తకి అయిన ఊర్వశి అర్జునుడిని మోహించగా, అర్జునుడు అమెతో "మీరు మా వంశకర్త అయిన పురూరవుని బార్య, అంతేకాక నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేసుంటారు. మీరు నాకు తల్లితో సమానం” అని తిరస్కరిస్తాడు. దీనికి ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడికి నపుంసకత్వము కలుగునట్లు శపించెను. ఈ విషయము ఇంద్రునికి తెలియగా, ఆ శాపము అర్జునుడి అజ్ఞాతవాస కాలమున అనుభవించునట్లును, తదనంతరము శాపవిమోచనము కలుగునట్లు అనుగ్రహించెను. నాటి ఈ శాపమే అజ్ఞాత వాసంలో అర్జునుడు తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా విరాటుని కొలువులో బృహన్నల విరాటుని కుమార్తెన ఉత్తరకి నాట్యం నేర్పేను. ఉత్తర గోగ్రహణ సమయం‌లో అర్జునుడు ఈ శాపం నుండి విముక్తిపొందాడు.

Sunday, October 6, 2019

అప్సరస: రంభ

దేవెంద్రుని అమరావతిలో దేవతల ఆనందం కోసం నియమింపబడిన అప్సరసలలో రంభ ఒకరు. ఈమె మిక్కిలి అందగత్తె.

రంభకు నలకుబేరుడు అంటే మిక్కిలి మక్కువ. ఆమె ఒకసారి నలకుబేరుని అంతఃపురం‌నకు వెళుతుండగా నలకుబేరుని సవతి కుమారుడైన రావణాసురుడు రంభను చూసి ఆమె సౌందర్యానికి మోహితుడై ఆమెను సమీపించెను. అప్పుడు రంభ “పర స్రీలను బలత్కారిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది” అని రావణాసురుని శపించెను. ఈ శాపం కారణంగానే రావణాసురుడు సీతా దేవిని అపహరించినా, ఎటువంటి అఘాయిత్యం చేయలేకపోయాడు.

బ్రహ్మర్షి పదవి కోసం విశ్వామిత్ర మహర్షి తీవ్ర తపస్సు చేస్తుండగా, దేవెంద్రుడు భయపడి ఆ తపస్సుని భంగం కలిగించుటకు రంభను పురమాయించెను. రంభ తన ఆట పాటలతో విశ్వామిత్రుని తపో భంగం కలిగించెను. తన తపోభంగం వలన ఆగ్రహించిన విశ్వామిత్రుడు పది వేల సంవత్సరముల వరకు శిలవై ఉండమని శపించెను.

Friday, September 27, 2019

అప్సరసలు


హిందూ పురాణాల ప్రకారం అప్సరసలు మిక్కిలి అందమైన వారు. వీరు స్వర్గాధిపతి ఇంద్రుని సభ అమరావతిలో దేవతలను తమ నాట్యగానాలతో అలరించడానికి నియమింపబడ్డారు. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: (1) ఋషులు, (2) గంధర్వులు, (3) నాగులు, (4) అప్సరసలు, (5) యక్షులు, (6) రాక్షసులు, (7) దేవతలు.

మన పురాణాల ప్రకారం అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ప్రమ్లోద, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, శుభానన, సుకేశి, నీలకుంతల, మన్మదోద్దపిని, అలంబుష, మిశ్రకేశి, ముంజికస్థల, క్రతుస్థల, వలాంగి, పరావతి, మహారూప, శశిరేఖ.

అప్సరసల పుట్టుక గురించి రకరకాల కథలు ఉన్నాయి. పూర్వం బ్రహ్మ దేవుని పిరుదుల్లో నుంచి కొందరు రాక్షసులు జన్మించారు. వీరంతా బ్రహ్మ దేవుని వెంట పడగా, బ్రహ్మ దేవుడు తన శరీరాన్ని వదిలిపెట్టి ఆనందంతో తన చేతిని వాసన చూసుకోవడంతో అప్సరసలు పుట్టారని ఒక కథనం ఉంది. అలాగే ఇంకొక కథనం ప్రకారము దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలికే సందర్భం‌లో అప్సరసలు పుట్టారని చెపుతారు.

వీరు అందంలో దేవతలను మించి పోతారని చెబుతారు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఎవరైనా ఘోర తపస్సు చేసే మునుల వలన తన సింహాసనానికి ఎసరు వస్తుందేమోనని భయపడి వారి తపస్సు భంగం కలిగించెందుకు అప్సరసలను పంపేవాడు.

Wednesday, September 25, 2019

మహాలయ అమావాస్య


మహా భారతం‌లో కురుక్షేత్ర యుద్దం అనంతరం కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించగా, పండు కోసుకుని తినుటకు ప్రయత్నించగా, ఆ పండు కాస్తా బంగారపు పండుగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి నీటిని తీసుకుని త్రాగుటకు ప్రయత్నించగా ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

దాంతో కర్ణుడు తనకిలా ఎందుకు జరుగుతున్నదని చితించుచు, తన తండ్రి అయిన సూర్యభగవాడుని ప్రార్ఢించగా "కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది" అని తెలిపాడు. పిమ్మట సూర్యదేవుని సహాయంతో, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆయన సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరి, అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజైనటువంటి అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

హిందూ పురాణాల ప్రకారం ఈ మహాలయపక్షంలో పితృదేవతలు భగవాన్‌ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారని, వీరిని సంతృప్తి చేసేందుకు తర్పణం వదలాలని చెపుతారు. కేవలం తర్పణమే కాకుండా మానవులకే కాకుండా జంతుజాలానికి కూడా చేయాలని చెపుతారు.

ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకుని ప్రార్థించాలి. అందుకే మహాలయ పక్షం‌లో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుందని చెప్తున్నారు.

Thursday, August 22, 2019

చిరంజీవులు ఎవరు?

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥


చిరజీవులు లేదా చిరంజీవులు అనగా మరణం లేనివారని అర్థం. భారతీయ పురాణాలు అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు మరియు వ్యాసులను చిరంజీవులని చెపుతున్నాయి.

అశ్వత్థామ: కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. కురక్షేత్ర యుద్దంలో తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోథంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేసి ఉపపాండవులను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. ఫలితంగా కలియుగం ముగిసేవరకు రోగ భారంతో అరణ్యాలలో సంచరించమని శ్రీ కృష్ణుడు అతనికి శాపం పెడ‌తాడు.

బలి చక్రవర్తి: ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు బలి. త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో, బలిని సంహరించుట కోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. ఆ విధంగా తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు.

హనుమంతుడు: శివుని తేజస్సుతోనూ, వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరీనందనుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. సూర్యుని శిష్యుడైన ఈ రామ భక్తుడు రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చడంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. కీర్తనం, స్మరణం, దాస్యం... ఇలా రాముని పరిపరివాధాలా సేవించి, భక్తులకు నిదర్శనంగా నిలిచాడు. ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు.

విభీషణుడు: కైకసి మరియు విశ్రవసు యందు పుట్టిన మూడవ కుమారుడు మరియు రావణాసురునికి సొంత తమ్ముడు విభీషణుడు. ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరిధర్మం కోసం చివరి వరకూ పట్టు పట్టినవాడు. శ్రీ రామునికి సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పాడు. శత్రువర్గం వాడైనప్పటికీ, రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు.

కృపాచార్యుడు: శరధ్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న వారిలో ఇతడు ఒకడు. మానవగర్భమందు జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి.

పరశురాముడు: శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఒకటి. రేణుక, జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశు (గండగొడ్డలి) కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు.

వేదవ్యాసుడు: సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన దృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే! కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచి క్రమబద్ధీకరించి ‘వేద వ్యాసుడు’ అనే బిరుదాన్ని గ్రహించారు. ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు.

Saturday, August 10, 2019

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు.

శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని అన్నాడు. 

తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆంధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మంచి గుర్తింపు పొందాయి. ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. 

తర్వాత 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు.

తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడి (జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌)గా పనిచేసాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకులు (విద్యాశాఖ డెరైక్టర్) వచ్చారు. ఆ ఉన్నతాధికారి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. తన పన్నెండో ఏటనే తెలుగులో కవిత్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు.

ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ ప్రార్థనా గీతం. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్న శంకరంబాడి సుందరాచారిని అక్క డున్న కొంతమంది గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించారు. ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.

నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచనలు చేశారు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడుపుచూ, తాగుడుకు అలవాటు పడి సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.

శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జ్ఞాపకార్ధము 2004 సంవత్సరములో తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతాసూచకంగా విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా ధ్వనించే ఏర్పాటు చేసింది.

Saturday, April 20, 2019

దేవవైద్యుడు ధన్వంతరి

హిందూమతంలో దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది.

క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. ఇందులో తొలుతగా హాలాహ‌లం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థముంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అన్న పేరు కూడా ఉంది.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు.

అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే మూలం కావడం విశేషం.

ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం"లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి. తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో కూడా ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.