/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Thursday, August 22, 2019

చిరంజీవులు ఎవరు?

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥


చిరజీవులు లేదా చిరంజీవులు అనగా మరణం లేనివారని అర్థం. భారతీయ పురాణాలు అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు మరియు వ్యాసులను చిరంజీవులని చెపుతున్నాయి.

అశ్వత్థామ: కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. కురక్షేత్ర యుద్దంలో తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోథంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరం మీద దాడి చేసి ఉపపాండవులను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. ఫలితంగా కలియుగం ముగిసేవరకు రోగ భారంతో అరణ్యాలలో సంచరించమని శ్రీ కృష్ణుడు అతనికి శాపం పెడ‌తాడు.

బలి చక్రవర్తి: ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు బలి. త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించడంతో, బలిని సంహరించుట కోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. ఆ విధంగా తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు.

హనుమంతుడు: శివుని తేజస్సుతోనూ, వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరీనందనుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. సూర్యుని శిష్యుడైన ఈ రామ భక్తుడు రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చడంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. కీర్తనం, స్మరణం, దాస్యం... ఇలా రాముని పరిపరివాధాలా సేవించి, భక్తులకు నిదర్శనంగా నిలిచాడు. ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు.

విభీషణుడు: కైకసి మరియు విశ్రవసు యందు పుట్టిన మూడవ కుమారుడు మరియు రావణాసురునికి సొంత తమ్ముడు విభీషణుడు. ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరిధర్మం కోసం చివరి వరకూ పట్టు పట్టినవాడు. శ్రీ రామునికి సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పాడు. శత్రువర్గం వాడైనప్పటికీ, రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు.

కృపాచార్యుడు: శరధ్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులకు, పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసాడు. యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్న వారిలో ఇతడు ఒకడు. మానవగర్భమందు జన్మించకపోవడం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి.

పరశురాముడు: శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఒకటి. రేణుక, జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశు (గండగొడ్డలి) కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు.

వేదవ్యాసుడు: సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబడేవాడు. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన దృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే! కేవలం భారతం మాత్రమే కాదు అష్టాదశ పురాణాలలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచి క్రమబద్ధీకరించి ‘వేద వ్యాసుడు’ అనే బిరుదాన్ని గ్రహించారు. ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు.