/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Wednesday, September 25, 2019

మహాలయ అమావాస్య


మహా భారతం‌లో కురుక్షేత్ర యుద్దం అనంతరం కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించగా, పండు కోసుకుని తినుటకు ప్రయత్నించగా, ఆ పండు కాస్తా బంగారపు పండుగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. కనీసం దప్పికయినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి నీటిని తీసుకుని త్రాగుటకు ప్రయత్నించగా ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

దాంతో కర్ణుడు తనకిలా ఎందుకు జరుగుతున్నదని చితించుచు, తన తండ్రి అయిన సూర్యభగవాడుని ప్రార్ఢించగా "కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది" అని తెలిపాడు. పిమ్మట సూర్యదేవుని సహాయంతో, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆయన సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరి, అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలి తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు వచ్చింది. ఈ మహాలయ పక్షములో చివరి రోజైనటువంటి అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

హిందూ పురాణాల ప్రకారం ఈ మహాలయపక్షంలో పితృదేవతలు భగవాన్‌ శ్రీ మహావిష్ణువు అనుమతితో భూమిపైకి వస్తారని, వీరిని సంతృప్తి చేసేందుకు తర్పణం వదలాలని చెపుతారు. కేవలం తర్పణమే కాకుండా మానవులకే కాకుండా జంతుజాలానికి కూడా చేయాలని చెపుతారు.

ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అటువంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తుంచుకుని ప్రార్థించాలి. అందుకే మహాలయ పక్షం‌లో కనీసం ఒక్కరోజైనా వారికి తర్పణం వదలాలి. సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం అన్ని విధాలుగా శుభాలను చేకూరుస్తుందని చెప్తున్నారు.