తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Saturday, November 2, 2024

కార్తీకమాసం విశిష్టత


శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీకమాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం.

అందుకే ఇది ముముక్షువుల మనసెరిగిన మాసం.

న కార్తీక నమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః

కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.

కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతో, కమలాలతో పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతోపాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట.

అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది.

తిధుల ముఖ్యత

ఈ మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిధిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

కార్తీక శుద్ధపాడ్యమి

తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, 'నేను చేయ దలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ

ఈ రోజు సోదరి ఇంటిల్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

తదియ

అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.

చవితి

కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.

ఏకాదశి

ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.

కార్తీక పూర్ణిమ

మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి.

కార్తీక బహుళ పాడ్యమి

ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం.

కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు భావిస్తారు. అదే విధంగా ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు విశ్వసిస్తారు. శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన, వనభోజనం వంటి ఆచరణలు పుణ్యప్రదం. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.