శ్రీ కృష్ణునికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్రాదేవి,లక్షణ అని పిలువబడే ఎనిమిది మంది భార్యలు కలరు. వీరినే “అష్టమహిషులు” అని కూడా పిలువబడుతారు.
రుక్మిణి దేవి:
విదర్భ రాజు భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణి దేవి శ్రీ కృష్ణుడిని గురించి విని అతడిని ఎంతగానో ప్రేమిస్తుంది. రుక్మిణీ దేవి యిష్టానికి వారి పెద్దలు అంగీకారం తెలపగా, ఆమె సోదరుడు రుక్మి మాత్రం తన స్నేహితుడైన శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి, ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. అయితే రుక్మిణి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో శ్రీ కృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే వచ్చి తనని చేపట్టమని సందేశాన్ని పంపుతుంది. పిమ్మట రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్ళి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగర పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వచ్చే సమయంలో రుక్మిణి దేవిని ఎత్తుకొచ్చి, ద్వారకలో వివాహం చేసుకుంటాడు.
జాంబవతి:
సత్రాజిత్తు అను రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజుకు పదహారు బారువుల బంగారం ప్రసాదించే శమంతకమణి అనే అద్భుతమైన మణిని పొందినాడు. ఆ శమంతక మణిని తనకు ఇవ్వమని శ్రీ కృష్ణుడు కోరగా, అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. అదే సమయంలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతక మణిని ధరించి వేటకు వెళ్ళగా, ఆ మణిని మాంసమని అనుకుని అతనిని ఒక సింహము చంపి మణిని తీసుకొని పోయింది. సింహము నోటిలో వున్న మణిని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఆ మణిని ఇచ్చాడు. శమంతక మణి ఇవ్వని కారణంగా శ్రీ కృష్ణుడే ప్రసేనుడిని చంపి, శమంతక మణిని దొంగిలించాడని అపవాదు ప్రచారం చేశారు. ఆ అపవాదు మాపుకొనుటకు శ్రీ కృష్ణుడు తన సైన్యంతో ప్రసేనుడి జాడ వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరం ఇంకా సింహపు అడుగు జాడలు కనిపించగా, వాటిని అనుసరిస్తూ జాంబవంతుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ జాంబవంతునితో 12 రోజులు యుద్దము చేసినాడు. యుద్ధం లో అలసిపోయిన జాంబవంతుడు శ్రీ కృష్ణుడు సాక్షాత్తు శ్రీ రాముడని తెలుసుకున్న జాంబవంతుడు మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసాడు.
సత్యభామ:
శ్రీ కృష్ణుడు జాంబవంతుడి దగ్గర వున్న శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేను. పిమ్మట జరిగిన విషయాన్ని తెలుకొని, అనవసరమైన అపవాదు శ్రీకృష్ణునిపై వేసినందుకు సత్రాజిత్తు విచారించెను. శ్రీ కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె అయిన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము చేసెను.
కాళింది :
సూర్యుని కుమార్తె అయిన కాళింది శ్రీ మహా విష్ణువుకు భార్య అవ్వాలని ఘోరమైన తపస్సు చేయగా ఆమె తపస్సుకు మెచ్చి కృష్ణావతారంలో ఆమె కోరిక తీర్చేనట్లుగా వరం ప్రసాదిస్తాడు. పిమ్మట ఆమె మరో జన్మ ఎత్తి శ్రీ కృష్ణుడిని వివాహం చేసుకుంటుంది.
మిత్రవింద:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “రాజాథిదేవి” అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య. వీరి కుమారులు విందానువిందులు, మరియు కుమార్తె మిత్రవింద. తన అన్నల కోరికకి వ్యతిరేకంగా మిత్రవింద స్వయంవరంలో శ్రీ కృష్ణుని వరించి వివాహం చేసుకుంటుంది.
నాగ్నజితి:
నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు కుమార్తె. కోసల రాజ్యములో ఏడు వృషభములు (ఎద్దులు) మదించిన ఏనుగుల వలె ప్రజలకు అపాయము చేయుచున్నవి. రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోవడంతో నాగ్నజిత్తు ఎవరైతే ఈ వృషబాలను బంధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ ప్రకటన విని ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.
భద్రాదేవి:
శ్రీ కృష్ణుని ఐదుగురు మేనత్తలలో ఒకరైన “శృతకీర్తి (శృతసేన)” కేకయ దేశపు రాజు దృష్టకేతు భార్య. వీరికి సంతర్థనుడూ అనే కుమారుడు, భద్ర అనే కుమార్తె కలరు. పెద్దల సమక్షంలో భద్రాదేవిని వివాహమాడాడు.
లక్షణ (లక్ష్మణ) :
మద్ర రాజ్యానికి రాజైన బృహత్సేనుని కుమార్తె లక్షణ. ఈమెకు వివాహం చేసేందుకు తండ్రి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఆ మత్స్య యంత్రాన్ని చేధిస్తారో వానికి తన కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీ కృష్ణుడు ఆ మత్స్య యంత్రాన్ని చేధించి, స్వయంవరంలో లక్షణను వివాహం చేసుకుంటాడు.
ఈ అష్ట మహిషులే కాకుండా పదహారు వేల మంది (కొన్ని గ్రంథాలలో పదహారు వేల ఒక వంద అని ఉన్నది) కృష్ణుడి భార్యలు వున్నట్లుగా హిందూ పురాణాలు చెపుతాయి. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి ఈ పదహారు వేల మంది భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. శ్రీ కృష్ణుడు నరకాసురున్ని వధించి, నరకాసురుని చెరలో ఉన్న పదహారు వేల మంది గోపికా స్రీలను విడిపించినాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు.
Comments
Post a Comment