Skip to main content

కుబేరుని ఇతివృత్తం

బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన కుబేరుడు అష్ట దిక్పాలకులలో ఒకడు. సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు. కుబేరుడు ఒక చేతిలో గదను కలిగి వుండి, మరొక చేతితో ధనాన్ని ప్రసాదిస్తూ కనిపిస్తాడు. కుబేరుని వాహనం నరుడని కొన్ని గ్రంధాలు పేర్కొనగా, మరికొన్ని గ్రంధాలలో పొట్టెలుగా అతని ఆధీనం‌లో పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవ నిధులు ఉంటాయి.

కుబేరుడు అనగా అవలక్షణాలున్న శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, పెద్ద పొట్టతో, మూడు కాళ్ళు, ఒక కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. కుబేరుని భార్య పేరు చిత్ర రేఖి. అతనికి పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కుమారులు మరియు మీనాక్షి అనే పుత్రిక కలదు.

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుని వద్ద కలియుగ ధైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన వివాహం నిమిత్తము ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం.

కుబేరుని జన్మ వృత్తాంతం:

కుబేరుడు పూర్వ జన్మలో కాంపిల్య నగరంలో గల యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు గుణనిధిగా జన్మించాడు. అతను పేరుకే గుణనిధి కాని, చెడు సావాసాల వలన దుర్వసనాలకు బానిస అయ్యాడు. ఇవి తెలిసి అతని తండ్రి ఇంటి నుండి వెళ్ళగొట్టగా, కాంపిల్య నగరం చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. యాదృచికంగా ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఆ ఊరి చివరనున్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. ఆకలితో ఉన్న గుణనిధి భక్తులంతా నిద్రపోయెంత వరకు వేచి వుండి, వారంతా నిద్రపోయిన తరువాత శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. ఆ గర్బ గుడిలో చీకటిగా ఉండి ఏమీ కనిపించకపోవడంతో, తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడే ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని విగ్రహం మీద పడి, తల పగిలి చనిపోతాడు. తన ఊరి నుండి పారిపోతూ పవిత్రమయిన గౌతమీ నదీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, ప్రసాదాల కోసం చేసిన జాగారం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ఇవన్నీ అనుకోకుండా చేసినా, యాదృచికంగా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” నానుడి ప్రసిద్ధిగాంచినది.

గుణనిధి తరువాత జన్మలో బ్రహ్మ పుత్రుడైన పులస్య బ్రహ్మర్షి కుమారుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిలకు వైశ్రవణుడిగా పుట్టినాడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు.

వైశ్రవణుడు చిన్నతనం నుండే శివ భక్తి తత్పరుడై కఠోరమైన తపస్సు చేయగా, ఆ తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిస్తాడు. కాని ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమని చెపుతాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు.

కుబేరుని సోదరులు రావణ, కుంభకర్ణులు:

కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన పాతాళ రాక్షస రాజైన సుమాలి మరియు అతని కుమార్తె కైకసి అసూయ చెంది, కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు అను రాక్షసులు మరియు విభీషణుడు అను సత్పుత్రుడు కలిగారు. ఈ విధంగా కుబేరుడు రావణాసురుడికి సోదరుడవుతాడు. రావణాసురుడు శివుని గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి అనేక వరాలు పొంది, తన వర బలంతో కుబేరుడిపై దండెత్తి లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుంటాడు.

ఓటమితో భయపడిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమయ్యి లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చాడు. శివానుగ్రహంతో అలకాపురం నుండి యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజుగా ఉత్తర దిక్కును పరిపాలించెను.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, ...