వశిష్ట మహర్షి (వసిష్టుడు) హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి మరియు సప్త ఋషులలో ఒకడు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో ఇతని ప్రస్తావన వస్తుంది. శ్రీ రాముడు జన్మించిన సూర్య వంశానికి రాజ పురోహితుడు మరియు రామ, లక్ష్మణ, భరత శతృఘ్నులు వశిష్ట మహర్షి వద్దనే విద్యాభ్యాసం చేసినారు.
వశిష్టుని పుట్టుక:
వశిష్టుడు మిత్రా వరుణలకు జన్మించాడు. మిత్రుడంటే సూర్యుడు మరియు వరుణుడు యజ్ఞం చేస్తుండగా అప్సరస అయిన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసిన వారి మనసు చలించి తేజస్సు జారింది. ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక కుండలో వశిష్ఠుడు మరొక కుండలో అగస్త్యుడు పుట్టారు. మిత్రుడికీ (సూర్యుడు) వరుణుడికీ పుట్టిన వాళ్ళనే అర్థంలో వీరిద్దరినీ "మైత్రా వరుణి" అని పిలుస్తారు. అలాగే కుండలో నుండి పుట్టినందున వీరిరువురును “కుంభజులు” అని కూడా పిలుస్తారు.
విశ్వామిత్రుని వైరం:
వశిష్టుని యొక్క యజ్ఞాలకు మెచ్చిన ఇంద్రుడు కామధేనువు పుత్రిక అయిన “శబల” (నందిని అని కూడా పిలుస్తారు) అనే గోవుని ఇస్తాడు. శబల కూడా కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. క్షత్రియునిగా జన్మించిన విశ్వామిత్రుడు ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరగా, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. అప్పుడు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల.. మహారాజుకు, ఆయన సైన్యానికి వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది. అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను కోరగా, వశిష్ఠుడు తిరస్కరించెను. పిమ్మట మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి అజ్ఞాపించగా, శబల ఎదురు తిరుగుతుంది. దాంతో విశ్వామిత్రుడు, అతడి సైన్యం వెనుదిరగాల్సి వస్తుంది. పిమ్మట విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, పరమశివుడి తీవ్రమైన తపస్సు చేసి, రాజర్షి అవుతాడు.
వశిష్టుని వివాహం:
వశిష్టునికి పరమ పతివ్రత అయిన అరుంధతితో వివాహమైంది. వీరికి వంద మంది కుమారులున్నారు.
హిందూ వివాహా సాంప్రదాయం ప్రకారం, వివాహానంతరం (పగలు అయిన రాత్రి అయినా ఏ సమయంలో అయినా) వధూవరులకు ఆకాశం వంక అరుంధతీ నక్షత్రాన్ని చూపించే ఆచారం చాలా ప్రాచీన కాలం నుండి సంప్రదాయంగా వస్తుంది. పతివ్రతల్లో మొదటి స్థానంలో ఉన్న ఈమె నింగిలో చుక్కలా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అందువలన పెళ్లైన జంటలు అరుంధతీ-వశిష్టుల దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి దాంపత్యం సుఖమయం చేసుకోవాలని పండితులు వధూవరులకు చెబుతారు.
Comments
Post a Comment