/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Wednesday, May 26, 2021

వైశాఖ పూర్ణిమ, బుద్ధ పూర్ణిమ విశిష్టత

హిందూ పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని “వైశాఖ పూర్ణిమ” అని పిలుస్తారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు.

భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసము దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకుని క్షీర సాగర మథనం ప్రారంభించారు. అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవడంతో వారు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహా విష్ణువు కూర్మ అవతారం రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీ మహా విష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును “ కూర్మ జయంతి” అంటారు.

అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ‌ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కుడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే.


ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అహింసే పరమ ధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు కూడా వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లుంబినీ (ప్రస్తుతం నేపాల్‌లో ఉంది)లో సిద్దార్ధునిగా జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కులీన శాక్య వంశానికి చెందిన సుద్దోదన మహరాజు, రాణి మాయదేవి. అయితే గౌతముడు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి మరణించగా, పిన తల్లి గౌతమి అనే మహిళ పెంచడం వలన గౌతముడనే పేరుతో కూడా పిలుస్తారు. యాదృచ్ఛికంగా చాలా రోజుల తరువాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడికి గయలోని బోధి (రావి) చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచాడు. అందువల్లే వైశాఖ పూర్ణిమ “బుద్ధ పూర్ణిమ”గా ప్రసిద్ధి చెందింది. అలాగే మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పలు బౌద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోధ్ గయ మరియు వారణాసి సమీపంలో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన కుషినగర్‌లలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

నేటికి రెండున్నర వేల సంవత్సరములు గడిచినా ఇంకా ఈ నాటికి కూడా బుద్దుడు తన అహింస ధర్మముతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక, బర్మా, థాయ్‌లాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ పలు దేశాల్లో బౌద్ధం విస్తరించి విరాజిల్లుతోంది.

No comments:

Post a Comment