Skip to main content

దేవవైద్యుడు ధన్వంతరి

హిందూమతంలో దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది.

క్షీరసాగరమధన సమయంలో దేవతలు, దానవులు అమృతం కోసం జోరుగా సాగరాన్ని చిలకసాగారు. ఇందులో తొలుతగా హాలాహ‌లం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవి ఇలా ఒక్కొక్కటే సాగరం నుంచి వెలువడసాగాయి. దేనికోసమైతే వారు ఆ క్రతువుని చేపట్టసాగారో, ఆ సమయం రానే వచ్చింది. పట్టుపీతాంబరాలతో, కుండలాలతో వెలిగిపోతూ ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ధన్వంతరి సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమే అని ఓ నమ్మిక. ధన్వంతరి అన్న శబ్దంలోనే బాధలను తొలగించేవాడు అన్న అర్థముంది. తన చేతిలో ఉన్న అమృతంతో దేవతల వ్యాధులన్నింటినీ ఒక్కపెట్టున నయం చేస్తాడట ధన్వంతరి. అందుకే ఆయనకు దేవవైద్యుడు అన్న పేరు కూడా ఉంది.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు.

అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే మూలం కావడం విశేషం.

ధన్వంతరిని విష్ణుమూర్తి అంశగా భావించడం వల్లనేమో ఆయనకు ప్రత్యేకించిన ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది. ఢిల్లీలోని "ఆయుర్వేద, సిద్ధ పరిశోధన మండలి కేంద్రం"లో ఒక పెద్ద, ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి. తమిళనాడు లోని శ్రీరంగం రంగనాధస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్ధంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు.

ఔషధ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కేరళలో ధన్వంతరికి ప్రత్యేకించిన పురాతన ఆలయాలు కొన్ని ఉన్నాయి. కేరళలో, గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు. కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. వ్యాధి నివారణకు, ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.

అలాగే తమిళనాడులోని శ్రీరంగనాధస్వామి ఆలయంలో, ధన్వంతరికి కూడా ఒక ఆలయం ఉంది. రామానుజాచార్యులవారికి ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. రామానుజాచార్యులవారు, రంగనాధస్వామి నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, ఇక్కడి నుంచి మూలికల కషాయాన్ని మూలవిరాట్టు దగ్గరకు పంపే ఆచారాన్ని మొదలుపెట్టారట.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో కూడా ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

శతానంద మహర్షి

శతానంద మహర్షి భారతీయ పురాణాలలో ప్రముఖమైన ప్రాచీన మహర్షులలో ఒకరు. ఆయన గౌతమ మహర్షి మరియు అహల్యల పుత్రుడుగా జన్మించాడు. ఈ కథలో ఆయన జన్మ, బాల్యం, విద్యాభ్యాసం మరియు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకుందాం. జననం మరియు నేపథ్యం గౌతమ మహర్షి మరియు అహల్యలు తమ తపఃశక్తితో లోకానికి సేవలందించిన మహా దంపతులు. అనేక సంవత్సరాల పాటు తపస్సు తర్వాత అహల్య, మాతృత్వం పొందాలనే కోరికను వ్యక్తపరిచింది. గౌతమ మహర్షి ఆమె కోరికను నెరవేర్చుతూ, వందరకాల ఆనందాన్ని అనుభవించి పుత్రోత్పత్తి చేశారు. అందువల్ల శత రకాల ఆనందాల ద్వారా పుట్టిన బాలుడిగా ఆయనకు శతానందుడు అనే పేరు పెట్టారు. విద్యాభ్యాసం మరియు బ్రహ్మచర్యం శతానందుడు తన బాల్యంలోనే తండ్రి గౌతమ మహర్షి వద్ద వేదాలు, ఉపనిషత్తులు మరియు ఇతర శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆయన బ్రహ్మచర్యాన్ని గౌరవిస్తూ, శాశ్వత ధర్మాన్ని పాటించేవాడు. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు శతానందుడి గొప్పతనాన్ని తెలుసుకున్న మిథిలా నగరపు రాజు జనకుడు, అతన్ని తన ఆస్థాన పురోహితునిగా నియమించుకోవాలని కోరాడు. గౌతమ మహర్షి శతానందుడికి పెళ్లి చేసి, అతన్ని మిథిలా పట్టణానికి పంపించారు. జనక మహారాజు శతానందుడిని తమ కుల...