/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Monday, April 6, 2009

తాళ్ళపాక కవులు

తాళ్ళపాక అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంధము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెండ్లి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

No comments:

Post a Comment