Skip to main content

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.    

10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో "నందవరం" గ్రామంలో స్థిరపడినవారు వందవారికులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవారికుడే. అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని బార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ.

అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొదిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. తిరుమలకు వెళ్ళే కొండదారిలో ఆయనకు అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించినదనీ, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించినదనీ చెబుతారు. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చెంతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీమి) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమనంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞనను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్లతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (పొత్తపినాడు) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట. అన్నమయ్య నరహరిని కీర్తించగా ఆ సంకెళలు తోలగిపోయాయట.

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", పంచమాగమ సార్వభౌముడు", ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

"సంకీర్తనా లక్షణమనే" సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం. పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు బలగర్వ మొప్పంగ బై లేచి సేన పట్టంబు గట్టించి ప్రభు పండరంగు బంచిన సామంత పడువతో బోయి కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి కట్టె దుర్గంబు గడు బయల్సేసి, కందుకూర్బెజవాడ గావించి మెచ్చి దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.

విష్వక్సేనుడు: శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధిపతి

తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో విష్వక్సేనులది ప్రధాన పాత్ర. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే విష్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం చెబుతోంది. అసలు విష్వక్సేనుడు ఎవరో తెలుసుకుందాం! శైవులు గణపతిని తొలిగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టుగానే వైష్ణవులు విష్వక్సేనుని ప్రతి కార్యంలోను పూజిస్తారు. శివ గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అయితే, విష్ణు గణాలకు అధిపతి విష్వక్సేనుడు. కూర్మ పురాణం ప్రకారం విష్వక్సేనుడు చూడటానికి విష్ణుమూర్తిలాగానే ఉంటాడు. ఈయనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడవ చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది, నాలగవ చేతిలో గద ఉంటుంది. తన యజమాని వలె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువుకు శ్రీవత్సం ఉంటే, విష్వక్సేనుడికి అవి ఉండవు. అలాగే కాళికా పురాణం, పాంచరాత్ర గ్రంథం లక్ష్మీ తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో విశ్వక్సేనుని గురించి ప్రస్తావించబడింది. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం‌లో ముక్కోటి ప్రదక్షిణంలో ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విష్వక్సేనుడి ఆలయం ఉంది. సంవ...