/* Adsense code */ /* End - Adsense code */
తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Saturday, January 1, 2022

పంచబేరాలు: తిరుమలలో కొలువై వున్న శ్రీనివాస మూర్తుల విగ్రహాలు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి జరిగే నిత్య కైంకర్యాలన్ని ఆగమ శాస్త్ర అనుసారం జరుగుతాయి. తిరుమ‌ల గ‌ర్భాల‌యం ఆనంద నిలయంలో స్వయంవ్యక్తమైన మూలవిరాట్టుతో పాటు మరో నాలుగు శ్రీనివాస మూర్తుల విగ్రహాలు కొలువై ఉంటారు. శ్రీ వారి విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు పంచబేరాలు అంటారు. బేర అంటే విగ్రహం. వీరికి మూలవిరాట్టుతో పాటు నిత్యం ప్రత్యేక పూజలు, నివేదనలు సాగుతున్నాయి. ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలైన విష్ణువు, మహావిష్ణు, సదావిష్ణు వ్యాపి నారాయణులకు సంకేతంగా పండితులు భావిస్తారు.

ధృవబేర:

తిరుమల కొండపై శ్రీవారి యొక్క దివ్వ సాలిగ్రామ బింబం. ఇది స్వయంభుగా వెలిసినది. ఈ మూల‌విరాట్టుని ధృవబేర అని అంటారు. ఈ విగ్రహం తిరుమల కొండపై స్వయంగా వెలిసినట్లుగా చెపుతారు. అత్యంత శక్తి వంతమైన ఈ విగ్రహానికి నిత్యం పూజలు జరుపుతూ వారానికి ఒక్కసారి అర్చకులు ఆగమపండితులు అతి పవిత్రంగా అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ స్వయంభుగా విగ్రహాన్ని కదల్చడానికి వీలు ఉండదు. అందువలన ఉత్సవాల సందర్భములలో ఊరేగింపులకు వేరే విగ్రహాలను ఉపయోగిస్తారు.

కౌతుకబేర:

శ్రీవారి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉండే వెండి విగ్రహాన్ని కౌతుకబేర అని అంటారు. ఈ విగ్రహాన్ని పదిహేను వందల సంవత్సరాల క్రితం సమవై అనే పల్లవరాణి సమర్పించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ విగ్రహమే భోగ శ్రీనివాసమూర్తిగా పిలువబడుతోంది. ప్రతి రోజూ జరిగే తోమాల సేవలో, రాత్రి పూట జరిగే ఏకాంత సేవలో ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఉపయోగిస్తారు. అలాగే ప్రతి బుధవారం ఆలయంలో జరిగే సహశ్ర కలశాభిషేకం సేవ ఈ స్వామి వారికే జరుగుతుంది. ఈ భోగ శ్రీనివాసమూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు.

ఉత్సవబేర:

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని ఉత్సవబేర అని పిలుస్తారు. ఈ స్వామి వారినే మలయప్ప స్వామి అంటారు. 700 సంవ‌త్స‌‌రాల‌కు పూర్వం నాటి ఒక శాస‌నంలో మలయప్ప స్వామి ప్రసక్తి ఉన్నది. పూర్వం ఒకానొక సందర్భములో స్వామివారు ఒక భ‌క్తుని ద్వారా త‌న సందేశాన్ని వినిపించాడ‌ని అంటారు. ఆ సం‌దేశానుసారం శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో శ్రీదేవి భూదేవి స‌హిత వేంక‌టేశ్వరుని విగ్రహం లభించింది. శ్రీదేవి, భూదేవి విగ్రహాలను ఉభయ నాంచారులు అని పిలుస్తారు. ఈ స్వామివారికి త‌మిళంలో `మ‌లై కునియ నిన్ర పెరుమాళ్‌` (అనగా త‌ల‌వంచిన ప‌ర్వతం మీద కొలువైన స్వామి) అని పిలువసాగారు. కాలక్రమం‌లో మల‌య‌ప్పస్వామిగా మారింది. శ్రీవారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం ఈ మలయప్పస్వామి వార్లకే జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భముగా తిరు మాడ వీధులలో జరిగే ఊరేగింపుల సంద‌ర్భంగా ప్రతి రోజూ ఆలయం వెలుపలకు వచ్చి మాడవీదుల్లో ఊరేగుతూ భ‌క్తుల‌కు ఆశీస్సుల‌ను అందిస్తారు.

బలిబేర:

తిరుమల గర్బగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహం. ఈయన కొలువు శ్రీనివాసుడు. మూల విరాట్‌కు తోమాల సేవ అనంతరం కొలువు శ్రీనివాసుని బంగారు వాకిలి వద్ద ఆలయ మండపానికి తీసుకువచ్చి రోజువారి కొలువు జరిపిస్తారు. కొలువులో మొదటిగా పంచాం‌‌గం శ్రవణం చేసి, తరువాత శ్రీవారి హుం‌‌‌డీ ద్వారా వచ్చే ఆదాయాలు, భక్తులు ఇచ్చిన కానుకల వివరాలను చదివి వినిపిస్తారు. ఈ కొలువు శ్రీనివాసమూర్తిని ఆలయం లోపల నుండి బయటకు తీసుకురారు.

ఉగ్రబేర:

గర్బగుడిలో ఉండే ఉగ్ర శ్రీనివాసుడుని 11వ శతాబద్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించినారు. ఈయన శ్రీదేవీ భూదేవి సహితుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఈయననే స్నపన బేర అనికూడా పిలుస్తారు.

No comments:

Post a Comment