ముస్లింలకు అతిపవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే.
నెలవంకను చూసినప్పట్నుంచీ ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు.
ఈ సందర్భంగా వారు ఖీర్ (పాయసం), బిరియానీ మామిడితో స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో ముస్లిం మతస్థులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు.
రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి పది రోజుల్లో పవిత్ర గ్రంధం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం.
ముస్లింల క్యాలెండర్‌లోని తొమ్మిదో నెలలో ఈ రంజాన్ పండుగ వస్తుంది. మన క్యాలెండర్‌లో లాగా వారి క్యాలెండర్‌లోని నెలల్లో 30, 31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్రదర్శనం నుంచి వారికి నెలా మొదలవుతుంది.
సంవత్సరం అంతా ఏ దానాలు, చేయకపోయినా, ఉపవాసాలు ఉండపోయినా రంజాన్ నెలలో తప్పకుండా దానధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజాలు (ఉపవాసాల)ను తప్పక పాటిస్తారు.
రంజాన్ నెలలోని 27వ తేదీన ' షబ్-ఎ-ఖద్ర్ ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది
'జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది వున్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం వుంది.
దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్ అనుచరుడు అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపాడు.
Comments
Post a Comment