Skip to main content

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?

మొట్టమొదటి తెలుగు శాసనాలు:

తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు‌ జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.


ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన:

రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్‌ రాయబారి మెగస్తనీస్‌ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.


ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.


భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం:

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని:

  •  వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. 

  • తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.

  • క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

ఆధార గ్రంథాలు:



  • Dravidian Languages Bhadriraju Krishnamurti Cambridge University Press (2003)

  • Comparative Dravidian Linguistics: Current Perspectives Bhadriraju Krishnamurti (2001)

  • ద్రావిడ భాషలు పి. ఎస్. సుబ్రమణ్యం (1994)

  • History and Geography of Human Genes Luigi Luca Cavalli-Sforza, Paolo Menozzi, Alberto Piazza (1994)

  • భాష, సమాజం, సంస్కృతి భద్రిరాజు కృష్ణమూర్తి (2000)

  • Journey of Man: A Genetic Odyssey Spencer Wells (2002)

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, ...