Skip to main content

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

Comments

  1. చిన్నప్పుడు విన్నాను మళ్లి ఇక్కడ చదవడం ఆ రోజుల్ని గుర్తుచేసింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్...

జయ విజయుల శాప పరిష్కారం మరియు మూడు జన్మల కథ

విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ద్వారపాలకులుగా జయుడు మరియు విజయుడి విగ్రహాలు ఉంటాయి. వీరి కథ చాలా ఆసక్తికరమైనది. వీరి గురించి భాగవత పురాణంలో ప్రస్తావించబడింది. పరమ విష్ణుభక్తులైన జయుడు మరియు విజయుడు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు. వీరు నిరంతరం శ్రీహరిని సేవిస్తూ, ఆయన సన్నిధిలో ఉండేవారు. జయ మరియు విజయుల పౌరాణిక కథ ఒక రోజు బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనక, సనత్కుమార, సనంద మరియు సనత్సు మహర్షులు శ్రీ మహా విష్ణువు దర్శనానికి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఈ మహర్షులు యోగశక్తితో సమస్త లోకాలను సంచరించే పరాక్రమ కలిగిన వారు. వారు ఎప్పుడూ పిల్లలుగా కనిపించే ప్రత్యేక వరం పొందినవారు. వీరి మహత్త్వాన్ని గుర్తించక జయుడు మరియు విజయుడు వారిని అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సనకాదుల మహర్షులు కోపంతో జయ, విజయులను, "మీరు భూలోకంలో మానవులుగా జన్మించండి" అని శపించారు. జయ విజయుల శాప పరిష్కారం ఈ శాపం గురించి విష్ణుమూర్తికి తెలిసి, ఆయన స్వయంగా ద్వారానికి వచ్చి, సనక, సనంద మహర్షులను లోపలికి తీసుకెళ్లారు. జయ మరియు విజయులు తమ చేసిన తప్పు గురించి క్షమాపణలు కోరారు. వారి...

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి: శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం). తెలుగు నెలలు చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు. పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము . పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వై...