Skip to main content

ఆది కవి నన్నయ్య

నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.
రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహంచినాడు. అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడైన వయ్యాకరణి నన్నయ. 'ఆంధ్రభాషానుశాసనం' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధి. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.
నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.
ఆయన ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతంచే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.
"శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే"
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)
భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు.




  1. ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి 

  2. అక్షర రమ్యత 

  3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.



భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై
(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)

Comments

Popular posts from this blog

మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించాడు. శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా తేది10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లెలో బెసెంట్ (అనీబిసెంట్) థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆయనకు అమితమైన ఆత్మవిశ్వాసం. ఒకసారి ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా, నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం.

క్రీస్తు శకం 848 వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం. పట్టంబు గట్టిన ప్రధమంబు నేడు బలగర్వ మొప్పంగ బై లేచి సేన పట్టంబు గట్టించి ప్రభు పండరంగు బంచిన సామంత పడువతో బోయి కొత్తముల్ పండ్రెండు గొని వేంగి నంటి గొల్చి యాత్రి భావనాంకుశ బాణ నిల్పి కట్టె దుర్గంబు గడు బయల్సేసి, కందుకూర్బెజవాడ గావించి మెచ్చి దీనికి ముందుగా ఎందరో మహానుభావులు పద్యాలు వ్రాసి ఉంటారు. అయితే శాసనాలు లభించిన మేరకు ఈ పద్యం మొదటిదిగ చరిత్రకారులు చెప్తూ ఉంటారు.

విష్వక్సేనుడు: శ్రీమహా విష్ణువు సర్వసైన్యాధిపతి

తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో విష్వక్సేనులది ప్రధాన పాత్ర. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే విష్వక్సేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానస ఆగమం చెబుతోంది. అసలు విష్వక్సేనుడు ఎవరో తెలుసుకుందాం! శైవులు గణపతిని తొలిగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టుగానే వైష్ణవులు విష్వక్సేనుని ప్రతి కార్యంలోను పూజిస్తారు. శివ గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు అయితే, విష్ణు గణాలకు అధిపతి విష్వక్సేనుడు. కూర్మ పురాణం ప్రకారం విష్వక్సేనుడు చూడటానికి విష్ణుమూర్తిలాగానే ఉంటాడు. ఈయనకి కూడా నాలుగు చేతులు ఉంటాయి. రెండు చేతుల్లో శంఖచక్రాలు, మూడవ చేతి చూపుడు వేలు పైకి చూపిస్తూ ఉంటుంది, నాలగవ చేతిలో గద ఉంటుంది. తన యజమాని వలె పసుపు రంగు దుస్తులు ధరించి ఉంటాడు. శ్రీ మహావిష్ణువుకు శ్రీవత్సం ఉంటే, విష్వక్సేనుడికి అవి ఉండవు. అలాగే కాళికా పురాణం, పాంచరాత్ర గ్రంథం లక్ష్మీ తంత్రం మరియు ఇతర ఆగమ గ్రంథాలలో విశ్వక్సేనుని గురించి ప్రస్తావించబడింది. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం‌లో ముక్కోటి ప్రదక్షిణంలో ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విష్వక్సేనుడి ఆలయం ఉంది. సంవ