తెలుగు మనది వెలుగు మనది! తెలుగు మాట్లాడు! తెలుగు వ్యాప్తి చెయ్యి!

Saturday, July 11, 2015

తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా !


తిరుమలలో శంఖనిధి,పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి,ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.

ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా! తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించేముందు మనం మనకాళ్ళను ప్రక్షాళనచేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.

ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు.

ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది.

ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారిదర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.

Sunday, August 5, 2012

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు రాసినవే! రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

సంబంధిత సమాచారం

Related Posts Plugin for WordPress, Blogger...